సిద్ధాపూర్ బచవో..డంపింగ్ యాడ్ హటావో..
సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ పై బగ్గు మన్న బిఆర్ఎస్..
షాద్ నగర్ చౌరస్తాలో భారీ ధర్నా..
హాజరైన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
మా భూముల్లోకి వస్తే అధికారులను బట్టలు ఊడదీసి కొట్టాలని పిలుపు.
నా ఊరు.. నా మండలం అంటివి .. జీవో ఎట్లొచ్చే..
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై నవీన్ రెడ్డి ఫైర్..
సీఎం రేవంత్, ఎమ్మెల్యే శంకర్ డౌన్ డౌన్ అంటూ రోడ్డుపై భారీ నినాదాలు
షాద్ నగర్,విశాల భారతి:నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ఎమ్మెల్యేను చేస్తే.. ప్రాంత ప్రయోజనాలను కాపాడాల్సిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం 50 కోట్ల ముడుపులు స్వీకరించి తమ నెత్తిన చెత్త పోస్తున్నాడని ఇలాంటి ఎమ్మెల్యే ప్రజల పక్షాన నిలబడకుండా మా భూముల జోలికి వస్తే రైతులు ప్రజలు ఎమ్మెల్యే బట్టలూడదీసి రాళ్లతో కొట్టి చంపండి అంటూ పాలమూరు ఎమ్మెల్సీ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో జరిగిన సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు విరుద్ధంగా ఆందోళన కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ ఎమ్మే సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి నాయకులు హాజరుకాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తదితర అనుచరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అందరూ కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు. కళ్ళుండి చూడలేని నాయకులు ప్రజాప్రతినిధులు అధికారుల భాగోతాలు కళ్ళారా చూడాలని తమ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెడుతూ డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల రైతులు వ్యవసాయ కూలీలు గిరిజనులు విద్యార్థులు మహిళలు ఆయా గ్రామాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్య అవకాశము ఉందని తమను ఈ చెత్త వల్ల కాపాడాలని కోరుకుంటూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.ఉమ్మడి
పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఈ ధర్నా సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం 50 కోట్ల రూపాయలు ముడుపులు అందినట్టు తమ సమాచారం ఉందని ఎమ్మెల్యే ఆయన అనుచరులు ఈ ముడుపులు తీసుకున్నట్టుగా ఆయన మీడియా ముందు మాట్లాడారు. ముడుపులు తీసుకోకపోతే ఎమ్మెల్యే శంకర్ రోడ్డుపైకి వచ్చి తమతోపాటే ఆందోళన చేయాలని సూచించారు.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం మంచిదని ఒకవేళ ఆ పదవి పోతే మళ్ళీ ఎమ్మెల్యే శంకర్ ను గెలిపించే బాధ్యత తమపై ఉంటుందని ఇక్కడ డంపింగ్ యార్డ్ ఆపాలంటే కచ్చితంగా ఎమ్మెల్యే శంకర్ రాజీనామా చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.దమ్ముంటే రాజీనామా చేయాలని మనిషిగా పుడితే మానవజన్మ ఎత్తితే 641 జీవో ఆపాలని పలుమార్లు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆగ్రహంగా మాట్లాడారు.
ఇదే పరిస్థితి కొనసాగితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను సైతం సిద్ధాపూర్ ఆందోళనకు తీసుకువస్తానని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు స్పందించండి..
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యేలు సాంప్రదాయ బద్ద రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే మౌనం వహించడం శ్రేయస్కరం కాదని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యేలకు అందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ప్రతిపక్షాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే మాజీ ఎమ్మెల్యేలు బక్కని నరసింహులు, ప్రతాప్ రెడ్డి, ఇంకా ఇతరులు ఈ సమస్య వైపు కూడా కన్నెత్తి చూడడం లేదని నవీన్ రెడ్డి ప్రశ్నించారు.
రాజకీయాలపై చిత్తశుద్ధి ప్రజలపై ప్రేమ ఉంటే సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఆందోళనలో వారు వెంటనే పాల్గొనాలని ఎమ్మెల్సీ కోరారు. నడిచౌరస్తాలో ఎమ్మెల్యేకు సవాల్ విసురుతున్నానని దమ్ముంటే పదవిని వదిలి ఆందోళనకు రావాలని పదవి పోతే గెలిపించే బాధ్యత తమదేనని సవాల్ విసిరారు.
ఈ మండలం నాదంటివి జీవో ఎట్లొచ్చే..
ఈ మండలం నాది ఈ ఊరి బిడ్డను నేను ఉన్నంతవరకు జీవో రానివ్వను చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు కానివ్వను అని ప్రగల్ బాలు పలికిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజలకు ఇప్పుడు సమాధానం చెప్పాలని నా మండలం అంటివి మరి జీవోలు ఎట్లొచ్చాయని సత్యనారాయణ ప్రశ్నించారు.
641 జీవో రద్దు జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. సీనియర్ నేత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇది అంతం కాదని ఇప్పుడే ఆరంభమైందని భవిష్యత్తులో న్యాయం జరగకపోతే మరో తెలంగాణ ఉద్యమం చవిచూడక తప్పదని నారాయణరెడ్డి హెచ్చరించారు.
నువ్వు చెత్త ఎమ్మెల్యే.. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
మంచి ఎమ్మెల్యే అయితే ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు చెత్త తీసుకొచ్చి మా నెత్తి పైన పెడితే నిన్ను కచ్చితంగా చెత్త ఎమ్మెల్యేని అంటారని నువ్వు మంచి ఎమ్మెల్యేగా మిగులుతావో లేక చెత్త ఎమ్మెల్యేగా మిగులుతావు నువ్వే నిర్ణయించుకో అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. షాద్ నగర్ చౌరస్తాలో జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ 641 జిఓ ప్రభుత్వం పథకం ప్రకారం ఇచ్చిందని స్థానిక ఎమ్మెల్యే శంకర్ దానిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. చరిత్రలో చరిత్ర హీనులుగా మిగలకూడదని మంచి పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని జోకర్ బ్రోకర్ ఎమ్మెల్యేగా మిగిలితే తనకే నష్టమని తీవ్ర పదజాలాలతో వ్యాఖ్యలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమం సందర్భంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి 40 నిమిషాలకు పైగా సాగిన ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, కడంపల్లి శ్రీనివాస్ గౌడ్, దేవేందర్ యాదవ్, కోస్గి శ్రీనివాస్, కౌన్సిలర్ నందారం అశోక్ యాదవ్, యుగంధర్,
రామకృష్ణ, దినేష్ సాగర్, శివా చారి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
ఫోటో రైటప్:షాద్ నగర్ చౌరస్తా లో ధర్నా చేస్తున్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి..
ఫోటో రైటప్:మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి..
