A place where you need to follow for what happening in world cup

- Advertisement -

సీఐ లేని మియాపూర్ పీఎస్  

0 269

సీఐ లేని మియాపూర్ పీఎస్
– రెండు వారాలుగా తాత్సారం
– పైరవీలతో నియామకం ఆలస్యమా..?
– అవస్థలు పడుతున్న ప్రజలు

సైబరాబాద్ – విశాల భారతి
సైబరాబాద్ కమిషనరేట్‌లో అత్యంత రద్దీగా ఉండే మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సీఐ పోస్టు రెండు వారాలుగా ఖాళీగా ఉండటంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. గత సీఐ శివప్రసాద్ సివిల్ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అయ్యారనే ఆరోపణలతో సీపీ కార్యాలయానికి అటాచ్ చేయడంతో ఆయన స్థానంలో ఇప్పటివరకు పూర్తిస్థాయి అధికారిని నియమించలేదు. దీంతో ఇన్‌చార్జ్‌తోనే స్టేషన్ నడుస్తోంది. ఒక అధికారిని బదిలీ చేసిన మరుక్షణమే మరొకరిని నియమించే ఆనవాయితీ ఉన్న పోలీస్ శాఖలో.. గత సీఐపై చర్యల అనంతరం మియాపూర్ విషయంలో రెండు వారాలైనా జాప్యం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఐటీ కారిడార్‌కు కూతవేటు దూరంలో ఉన్న మియాపూర్ పీఎస్ పరిధిలో మియాపూర్, జేపీ నగర్ కాలనీ, మదీనగూడ, మాతృశ్రీ నగర్, మైత్రి నగర్, మార్తాండ నగర్, ఆదిత్య నగర్‌తో పాటు హఫీజ్‌పేట్ వరకు విస్తరించిన వందల కాలనీలు ఉన్నాయి. 3 లక్షలకు పైగా జనాభా, వేలాది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండే ఈ ప్రాంతంలో భూ వివాదాలు, సైబర్ నేరాలు, దొంగతనాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. మియాపూర్ చౌరస్తా, మెట్రో స్టేషన్, డిపో పరిసరాల్లో ట్రాఫిక్, ఈవ్‌టీజింగ్ సమస్యలు నిత్యకృత్యం. అయినా కీలకమైన సీఐ పోస్టు భర్తీ చేయకపోవడంతో కేసుల దర్యాప్తు, ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్లు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్లు, ఎన్‌ఓసీలన్నీ పెండింగ్‌లో పడ్డాయి. రౌడీషీటర్లపై నిఘా, రాత్రి గస్తీ పర్యవేక్షణ కూడా కొరవడిందని సిబ్బంది అంటున్నారు.
సివిల్ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అయ్యారనే ఆరోపణలతో సీఐని సీపీ కార్యాలయానికి అటాచ్ చేసినా.. రెండు వారాలైనా కొత్త సీఐ నియామకం జరగకపోవడంతో రాజకీయ పైరవీలు, తమకు అనుకూలమైన వ్యక్తిని తెచ్చుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతి ఆరోపణలు వస్తే క్షణాల్లో సస్పెండ్ చేసే శాఖ.. పూర్తిస్థాయి సీఐ నియామకానికి మాత్రం రెండు వారాలు తీసుకోవడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు పక్కనపెట్టి వెంటనే నిజాయతీపరుడైన సీఐని నియమించి శాంతిభద్రతలు కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.