A place where you need to follow for what happening in world cup

- Advertisement -

సీఎంసీ భవనానికి హైకోర్టు బ్రేక్

0 203

సీఎంసీ భవనానికి హైకోర్టు బ్రేక్
– మియాపూర్ స్థలంపై ‘స్టేటస్ కో
– రూ.161 కోట్ల ప్రాజెక్టుపై నీలినీడలు
– భూ యాజమాన్య వివాదంతో నిలిచిన పనులు
– ప్రత్యామ్నాయాలపై అధికారుల కసరత్తు?

సైబరాబాద్ – విశాల భారతి
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) నూతన ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి బ్రేక్ పడింది. మియాపూర్‌లో రూ.161 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు తొలి అడుగులోనే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. సీఎంసీ భవనం కోసం కేటాయించిన భూమిపై యాజమాన్య హక్కుల వివాదం తలెత్తడంతో తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు చేపట్టరాదని, యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఈ మెగా ప్రాజెక్టు భవితవ్యం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.ఐటీ కారిడార్ పరిధిలో పరిపాలనా సేవలను ఒకే గొడుగు కిందికి తెస్తూ, అంతర్జాతీయ హంగులతో సీఎంసీ ప్రధాన కార్యాలయ భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వైభవంగా శంకుస్థాపన కూడా చేశారు. సైబరాబాద్ వేగవంతమైన అభివృద్ధికి ఈ భవనం గుండెకాయలా మారుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే శంకుస్థాపన ముగిసిన కొద్ది రోజులకే ఈ భూమి తమదంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ వరకు సదరు స్థలంలో పనులన్నీ నిలిపివేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేశారు. కోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఇక్కడ ఇటుక కదిలే పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టు తీవ్రంగా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలయాపనను నివారించేందుకు అధికారులు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మియాపూర్ లేదా దానికి సమీప ప్రాంతాల్లో వివాదాల్లేని ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు.
మరోవైపు ఈ న్యాయ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకుని, ఇదే స్థలంలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అడ్డంకులను అధిగమించేందుకు న్యాయ నిపుణులతో అత్యవసర సంప్రదింపులు జరుపుతోంది. వచ్చే హైకోర్టు విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపైనే సీఎంసీ భవన భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Leave A Reply

Your email address will not be published.