A place where you need to follow for what happening in world cup

- Advertisement -

అక్రమార్కులకు ‘టౌన్ ప్లానింగ్’ అండదండలు! – సర్కిల్-49 పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

0 88

అక్రమార్కులకు ‘టౌన్ ప్లానింగ్’ అండదండలు!
– సర్కిల్-49 పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
– నిబంధనలు తుంగలో తొక్కి అదనపు అంతస్తుల నిర్మాణం
– గచ్చిబౌలి, నల్లగండ్ల, శ్రీరామ్ నగర్ లో ‘మామూలు’ పర్వం?
– చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు.. సర్వత్రా విమర్శలు

శేరిలింగంపల్లి,విశాల భారతి
శేరిలింగంపల్లి సర్కిల్-49 పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ, అనుమతులకు విరుద్ధంగా వెలుస్తున్న భారీ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా,శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాల హవా నడుస్తోంది. రెండు, మూడు అంతస్తుల అనుమతి తీసుకుని ఏకంగా ఐదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున ‘మామూళ్ల’ పర్వం నడిచిందనే విమర్శలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి.

నోటీసులతో సరిపెడుతూ..
అక్రమ నిర్మాణాలపై స్థానికులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినా క్షేత్రస్థాయి అధికారులు మాత్రం కేవలం ‘నోటీసుల’ జారీతోనే సరిపెడుతున్నారు. పునాది దశలోనే నిలువరించాల్సిన అక్రమ కట్టడాలు స్లాబులు పడి, రంగులు వేసే వరకు అధికారులు అటువైపు కంటిచూపు కూడా సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. సామాన్య నివాసితులు చిన్నపాటి నిబంధన ఉల్లంఘనకు పాల్పడినా జరిమానాలు, కూల్చివేతలతో విరుచుకుపడే టౌన్ ప్లానింగ్ విభాగం నిబంధనలను నిలువునా పాతర వేస్తూ నిర్మిస్తున్న భారీ అక్రమ కట్టడాల పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల ఈ పక్షపాత వైఖరి వెనుక అంతర్యమేమిటని మండిపడుతున్నారు.

నిబంధనలకు పాతర….
అనుమతులకు మించి నిర్మిస్తున్న ఈ అదనపు అంతస్తుల వల్ల స్థానికంగా మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. డ్రైనేజీ వ్యవస్థపై అదనపు భారం పడటంతో పాటు రోడ్లపైకి మురుగునీరు పొంగిపొర్లుతోంది. వీటికి తోడు భవనాల్లో తగినంత పార్కింగ్ స్థలం కేటాయించకపోవడంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారు. ఫలితంగా కాలనీల్లో నిత్యం తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ అక్రమ ధోరణి వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన పన్నుల రూపంలో భారీగా గండి పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సమగ్ర విచారణ జరగాలి…
గత కొన్నేళ్లుగా సర్కిల్-49 పరిధిలో మంజూరైన భవన అనుమతులు ఎన్ని, నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన భవనాలు ఎన్ని, వాటిపై ఇప్పటివరకు తీసుకున్న కఠిన చర్యల వివరాలను తక్షణమే బహిరంగ పరచాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా సహకరిస్తూ విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, సర్కిల్ పరిధిలో తక్షణమే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.