రాయదుర్గం లో విషాదం
– తల్లిదండ్రుల గొడవలతో మనస్తాపం
– 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
సైబరాబాద్ – విశాల భారతి
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రుల మధ్య నిరంతరం జరిగే గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన 15 ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.పోలీసుల కథనం ప్రకారం… గచ్చిబౌలి రాజీవ్ నగర్ వడ్డెర బస్తీలో ఎల్లయ్య అనే వ్యక్తి తన భార్య, కుమారుడు మోహన్, కూతురితో కలిసి నివసిస్తున్నాడు. ఎల్లయ్య దంపతులు నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తుండగా, మోహన్ గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే, మోహన్ తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ క్రమంలోనే శనివారం రాత్రి తండ్రి ఎల్లయ్య మద్యం సేవించి ఇంటికి వచ్చి, భార్యతో మళ్లీ గొడవకు దిగాడు. తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు మోహన్ ప్రయత్నించాడు. ఎందుకు గొడవ పడుతున్నారంటూ తండ్రిని వారించబోగా, ఆగ్రహానికి గురైన ఎల్లయ్య కుమారుడిని తీవ్ర పదజాలంతో దూషించాడు. తండ్రి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు, ఇక మీరు మారరా అంటూ కోపంతో సమీపంలోనే ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు.కొంత సమయం తర్వాత కుమారుడిని వెతుక్కుంటూ తల్లి అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ గదిలోకి వెళ్లి చూడగా, మోహన్ ఇంట్లోని ఐరన్ రాడ్‌కు చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని కిందికి దించి, చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
