A place where you need to follow for what happening in world cup

- Advertisement -

షాబాద్ సంచలన కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతి

0 246

షాబాద్ సంచలన కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతి
– కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలోని ఓ వెంచర్‌లో మృతదేహం లభ్యం
– పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు

సైబరాబాద్ – విశాల భారతి
షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసుతో పాటు ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ మృతిచెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామం సమీపంలోని ఒక వెంచర్‌లో సోమవారం అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
షాబాద్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘోరాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో రాజ్‌కుమార్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న అతడి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వివిధ ప్రాంతాల్లో వేట సాగించాయి. ఈ క్రమంలో పంజర్ల సమీపంలో అతడు శవమై కనిపించడం కేసులో కీలక పరిణామంగా మారింది.
రాజ్‌కుమార్ మృతికి గల కారణాలపై ప్రస్తుతం స్పష్టత రాలేదు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఇతర కారణాల వల్ల మృతి చెందాడా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడి మరణంతో ఈ కేసు దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. కేసు విచారణ కొనసాగుతోందని, పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.