మూసీ ప్రాజెక్టు కలకలం
– మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్‌కు ఆర్డీవో నోటీసులు
సైబరాబాద్ – విశాల భారతి
మూసీ నది పునరుజ్జీవనం, అభివృద్ధి ప్రాజెక్టు పరిధిలోకి వస్తుందనే కారణంతో రాజేంద్రనగర్ లోని మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తక్షణమే అపార్ట్మెంట్లను ఖాళీ చేయాలని రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడటంతో అక్కడ నివసిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఆందోళనలో మునిగిపోయాయి. ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను వెంటనే వదిలి వెళ్లాలని చెప్పడంతో బాధితులు తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారు.
గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా మాట్లాడుతూ మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్‌ను కూల్చివేయకుండానే మూసీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని నివాసితులు గుర్తు చేస్తున్నారు. అధినేత స్థాయిలోనే అభయం లభించిన తర్వాత కూడా అధికారులు మళ్లీ ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై నిరసన తెలుపుతూ నివాసితులు ఎంఆర్వోకు చట్టబద్ధమైన లీగల్ నోటీసులు పంపారు.
తమ హక్కుల పరిరక్షణ కోసం ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు అపార్ట్మెంట్ వాసులు వెల్లడించారు. న్యాయస్థానంలో ఉన్న పిటిషన్‌పై స్పష్టమైన తీర్పు లేదా ఆదేశాలు వచ్చే వరకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకూడదని తమ లీగల్ నోటీసులో గట్టిగా స్పష్టం చేశారు. మరోవైపు, ఇళ్లను ఖాళీ చేయిస్తే ఇచ్చే పరిహారం లేదా ప్రత్యామ్నాయ వసతులపై ఆర్డీవోను వివరణ కోరగా, ప్రస్తుతం నష్టపరిహారానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి స్పష్టత లేదని చెప్పడం వారి ఆందోళనను మరింత పెంచింది.
తగిన పరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన, రాతపూర్వక హామీ లభించేంత వరకు ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని యజమానులు తేల్చిచెప్పారు. కోర్టు ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని భావించి న్యాయపోరాటానికి దిగినట్లు తెలిపారు. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు, మరోవైపు సర్వస్వం కోల్పోతామనే భయంతో నివాసితులు చేస్తున్న పోరాటంతో మధుపార్క్ రిడ్జ్ వ్యవహారం రాజేంద్రనగర్ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిశీలనలో ఉన్నందున, న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ఆధారంగానే తదుపరి అడుగులు వేస్తామని అధికారులు వెల్లడించారు.
