A place where you need to follow for what happening in world cup

- Advertisement -

పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ సెక్రటరీ పృథ్వీశ్వర్‌రెడ్డి సస్పెన్షన్

0 92

పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ సెక్రటరీ పృథ్వీశ్వర్‌రెడ్డి సస్పెన్షన్
– జాయింట్ సెక్రటరీ విష్ణుకుమార్‌గౌడ్‌కు తాత్కాలిక బాధ్యతలు
– డీజీపీ, సీపీలను ఆశ్రయించిన బాధిత బాలిక తల్లిదండ్రులు
– ఆర్థిక అవకతవకలపైనా ‘బీఎఫ్‌ఐ’ విచారణ

సైబరాబాద్ – విశాల భారతి
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (టీబీఏ) జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తీవ్ర ఆరోపణలు, పోక్సో (POCSO) కేసు నమోదు నేపథ్యంలో టీబీఏ అత్యవసర సమావేశం నిర్వహించి ఆయనను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.పృథ్వీశ్వర్‌రెడ్డిపై తీసుకున్న క్రమశిక్షణ చర్యల వివరాలను బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్‌ఐ)కు లేఖ ద్వారా తెలిపింది. ఆయన స్థానంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న విష్ణుకుమార్‌గౌడ్‌కు తాత్కాలికంగా జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది.

పోలీసుల తీరుపై నిరసన.. డీజీపీకి ఫిర్యాదు..
మరోవైపు, తీవ్రమైన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న పృథ్వీశ్వర్‌రెడ్డిని పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై బాధిత బాలిక తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంపై మండిపడుతూ రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ సీపీలను కలిసి ఫిర్యాదు సమర్పించారు. బాస్కెట్‌బాల్ క్రీడలో మంచి భవిష్యత్తు ఉన్న తమ కుమార్తెపై జరిగిన వేధింపుల వల్ల ఆమె తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతోందని వాపోయారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఆర్థిక అవకతవకలపైనా నిఘా..
పృథ్వీశ్వర్‌రెడ్డికి వివాదాలు కొత్తేమీ కావు. ఒకవైపు లైంగిక వేధింపుల విచారణ కొనసాగుతుండగానే, మరోవైపు తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అసోసియేషన్ నిధుల మళ్లింపు, లెక్కల్లో చూపిన అక్రమాలపై జాతీయ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ (బీఎఫ్‌ఐ) కూడా ప్రత్యేక విచారణ చేపట్టింది. ఈ అవకతవకలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని బీఎఫ్‌ఐ ఆదేశించినట్లు సమాచారం.ఒకేసారి పోక్సో కేసుతో పాటు ఆర్థిక అక్రమాల ఆరోపణలు చుట్టుముట్టడంతో తెలంగాణ బాస్కెట్‌బాల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.

Leave A Reply

Your email address will not be published.