అనుమతుల్లేవు….డీజేపై ఉక్కుపాదం!
• పనామా ఎక్స్‌రోడ్‌లో అనుమతుల్లేని డీజే సౌండ్‌పై స్థానికుల ఫిర్యాదు
• వారాహి షాప్ ప్రారంభోత్సవంతో ట్రాఫిక్‌కు అంతరాయం.. బస్‌స్టాప్ వద్ద ప్రయాణికుల అవస్థలు
• రహదారులకు అడ్డంగా బోర్డులు, భారీ శబ్దాలతో ప్రజల్లో భయాందోళన
• నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవు.. సీఐ రవిబాబు కఠిన హెచ్చరిక
ఎల్ బి నగర్ – విశాల భారతి
నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే అత్యంత రద్దీ ప్రాంతమైన వనస్థలిపురం పనామా ఎక్స్‌రోడ్‌లో అనుమతులు లేకుండా భారీ డీజే సౌండ్ నిర్వహించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. శనివారం వారాహి సిల్క్స్ అండ్ సిల్వర్ జువెలరీ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా భారీ శబ్దాలతో డీజే నిర్వహించడంతో పాటు, రహదారులకు అడ్డంగా ప్రచార బోర్డులు, కార్యక్రమ ఏర్పాట్లు చేశారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య కార్యక్రమం పేరుతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించడం, బస్‌స్టాప్ వద్ద ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ సినీ తారల చేతుల మీదుగా షాప్ ప్రారంభోత్సవం జరగడంతో భారీగా జనసమూహం తరలివచ్చింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో పనామా ఎక్స్‌రోడ్‌లో ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రధానంగా అంబులెన్సు దారి ఇవ్వకుండా, ప్రజలు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు, పాదాచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని ఆరోపిస్తున్నారు. అధిక డెసిబెల్స్‌తో మారుమోగిన డీజే సౌండ్ కారణంగా సాధారణ ప్రజలు ఒకింత భయాందోళనకు గురైనట్లు కూడా సమాచారం.
బస్‌స్టాప్ వద్దే హడావుడి.. ప్రయాణికుల ఇక్కట్లు!
పనామా ఎక్స్‌రోడ్ వద్ద ఉన్న బస్‌స్టాప్ ప్రాంతంలోనే కార్యక్రమానికి సంబంధించిన హడావుడి కొనసాగడంతో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని స్థానికులు వాపోయారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు రద్దీ మధ్య నిలబడాల్సి రావడం, పాదాచారులు రహదారిని దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు. బస్సులు ఆగాల్సిన ప్రదేశంలో వాణిజ్య కార్యక్రమాల హడావుడి నెలకొంటే ప్రజల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, రహదారులకు అడ్డంగా బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వాహనదారుల దృష్టి మరలడంతో పాటు ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అత్యంత రద్దీగా ఉండే పనామా ఎక్స్‌రోడ్‌లో ఇలాంటి ఏర్పాట్లకు అనుమతులు లేకపోతే అధికారులు ముందుగానే ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు కూడా స్థానికుల నుంచి వస్తున్నాయి.
అనుమతుల్లేవు.. పోలీసుల స్పష్టీకరణ
ఈ ఘటనపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో విషయం వనస్థలిపురం పోలీసుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా స్థానికులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, అనుమతులు లేకుండా డీజే నిర్వహిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు డీజే సౌండ్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎస్ఐ రవి, ఇన్స్పెక్టర్ రవిబాబు ఫిర్యాదుదారులతో మాట్లాడి పరిస్థితిపై స్పందించినట్లు సమాచారం. సంబంధిత అనుమతులు లేకుండా భారీ శబ్దాలతో డీజే నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు తెలిసింది.
సీఐ హెచ్చరిక.. ఇకపై ఉపేక్షించేది లేదు!
వారాహి సిల్క్స్ అండ్ సిల్వర్ జువెలరీ షాప్ వద్ద భవిష్యత్తులో అనుమతులు లేకుండా డీజే సౌండ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవిబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రజలకు, వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందులు కలిగించేలా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది.
వాణిజ్య సంస్థలు తమ ప్రచారం, ప్రారంభోత్సవాలు చేసుకోవడం తప్పుకాదని, అయితే ప్రజల భద్రతను, ట్రాఫిక్ నిబంధనలను, శబ్ద కాలుష్య నియంత్రణను పక్కనపెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించడం మాత్రం సహించరాదని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా బస్‌స్టాప్‌లు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. “వ్యాపారం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు.. ప్రచారం పేరుతో రహదారులను ఆక్రమించొద్దు.. అనుమతులు లేకుండా డీజే మోతతో ప్రజల ప్రశాంతతను భంగం చేయొద్దు” అంటూ స్థానికులు ఘాటుగా హెచ్చరిస్తున్నారు. ఇకనైనా అధికారులు రద్దీ ప్రాంతాల్లో నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేక నిఘా పెట్టి, అనుమతుల్లేని డీజేలు, అక్రమ బోర్డులు, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ఏర్పాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ అధికారులు పోలీసులను ప్రజలు కోరుతున్నారు.
