రూ.3 కోట్ల సర్కారు భూమి స్వాహా… ఐదు శాఖలు సైలెంట్!
– కబ్జాదారులకు అండగా అధికార యంత్రాంగమా?
– రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హెచ్‌ఎండీఏ, హైడ్రా, టౌన్ ప్లానింగ్‌పై తీవ్ర విమర్శలు
సైబరాబాద్ – విశాల భారతి
ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన ఐదు ప్రభుత్వ శాఖలే ప్రేక్షక పాత్ర పోషిస్తే కబ్జాదారులకు ఇంకేం అడ్డుంటుంది? శేరిలింగంపల్లి మండలం సందయ్యనగర్‌లో సుమారు రూ.3 కోట్ల విలువైన 200 గజాల ప్రభుత్వ స్థలం నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ అయి, అక్రమ నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నా సంబంధిత శాఖలు ఒక్కటీ స్పందించకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హెచ్‌ఎండీఏ, హైడ్రా, సైబరాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ శాఖల మౌనం వెనుక అధికారుల కుమ్మక్కు ఉందనే ఆరోపణలు స్థానికుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై వరుసగా కథనాలు వెలువడినా, కాలనీవాసులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికార యంత్రాంగంలో ఎలాంటి కదలిక కనిపించలేదు. ఒక్క శాఖ కూడా స్థలాన్ని పరిశీలించలేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఇంత బహిరంగంగా ప్రభుత్వ భూమి కబ్జా కావడం వెనుక అధికారుల సహకారం లేకుండా సాధ్యం కాదని స్థానికులు మండిపడుతున్నారు.
సదరు స్థలం ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే నమోదై ఉందని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ నకిలీ దస్తావేజులు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఆ ప్రక్రియను రిజిస్ట్రేషన్ శాఖ ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్తి చేయడం ఇప్పుడు పలు అనుమానాలకు కేంద్రంగా మారింది. ప్రభుత్వ భూమి అనే విషయం తెలిసినా, రికార్డులు సరిచూడకుండా రిజిస్ట్రేషన్ జరగడం వెనుక ఎవరి అండ ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే అక్కడ నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. అనుమతులు లేకుండా భవనం నిర్మిస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసు ఇవ్వలేదు. నిర్మాణాలను నిలిపివేయాల్సిన సైబరాబాద్ మున్సిపల్ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. లేఅవుట్ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాల్సిన హెచ్‌ఎండీఏ కూడా మౌనం పాటించింది.
ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా కూడా ఈ కబ్జాపై స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు గతంలోనే ఈ స్థలం ప్రభుత్వానిదని గుర్తించిన రెవెన్యూ శాఖ రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే కబ్జాదారులకు అవకాశం లభించిందని స్థానికులు అంటున్నారు. స్థలానికి ఫెన్సింగ్ వేయలేదు. ప్రభుత్వ భూమి అనే బోర్డు ఏర్పాటు చేయలేదు. ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయలేదు. దీంతో ప్రభుత్వ ఆస్తి అనాథగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
“ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో సహించం” అని తరచూ ప్రకటించే అధికారులు, కోట్ల రూపాయల విలువైన భూమి కళ్లముందే కబ్జా అవుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక శాఖ మరో శాఖపై బాధ్యత నెట్టేస్తూ కాలం గడపడం వల్ల చివరకు ప్రభుత్వ ఆస్తులే మాయమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సందయ్యనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఈ స్థలాన్ని కమ్యూనిటీ హాల్, పార్కు వంటి ప్రజా అవసరాల కోసం అభివృద్ధి చేయాలని ఎన్నాళ్లుగానో కోరుతోంది. అయితే ఇప్పుడు అదే స్థలం కబ్జాకు గురికావడంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేయాలని, జరుగుతున్న నిర్మాణాలను కూల్చివేయాలని, సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్పందన లేకుంటే జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, ఇతర ఉన్నతాధికారులను ఆశ్రయించి, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే ఐదు శాఖలు మౌనంగా ఉండడం సాధారణ నిర్లక్ష్యమా? లేక అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సందయ్యనగర్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
