A place where you need to follow for what happening in world cup

- Advertisement -

కూతురి కాపురం కూల్చావని కక్ష – హాస్టల్‌ నుంచి పిలిచి నరికి చంపారు

0 112

కూతురి కాపురం కూల్చావని కక్ష
– హాస్టల్‌ నుంచి పిలిచి నరికి చంపారు
– మాదాపూర్‌లో వరంగల్‌ యువకుడి దారుణ హత్య
– పాత ప్రేమ వ్యవహారమే కారణం
– ఐదుగురు నిందితులపై అనుమానం

సైబరాబాద్ క్రైమ్ బ్యూరో  – విశాల భారతి ఐటీ హబ్‌ మాదాపూర్‌లో పాతకక్షలు భగ్గుమన్నాయి. కూతురి కాపురం ముక్కలవడానికి కారణమయ్యాడన్న కోపంతో ఓ యువకుడిని ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపారు. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘాతుకం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా మదన్నపేట్‌ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్‌ (30) నగరానికి వచ్చి అయ్యప్ప సొసైటీలోని ఒక హాస్టల్‌లో ఉంటున్నాడు. భాస్కర్‌ గతంలో తన స్వగ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరిది కులాంతర ప్రేమ కావడంతో యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో మూడేళ్ల క్రితం సదరు యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిపించారు.
అయితే, పెళ్లయిన కొద్దిరోజులకే సదరు దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తమ కుమార్తె దాంపత్య జీవితం విచ్ఛిన్నం కావడానికి భాస్కరే కారణమని యువతి తండ్రి రాజు, అతని కుటుంబ సభ్యులు తీవ్ర కక్ష పెంచుకున్నారు. గతంలోనూ భాస్కర్‌ను చంపేస్తామంటూ పలుమార్లు బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి పక్కా స్కెచ్‌తో ఐదుగురు వ్యక్తులు అయ్యప్ప సొసైటీలోని హాస్టల్‌ వద్దకు చేరుకున్నారు. మాట్లాడాలని చెప్పి భాస్కర్‌ను బయటకు పిలిచారు. అతడు హాస్టల్‌ వెలుపలికి రాగానే ఒక్కసారిగా కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన భాస్కర్‌ అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు. మృతుడి సోదరుడు చిన్నపల్లి మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.