పాఠశాలల్లోనే ప్రజాస్వామ్య పాఠాలు
– నారాయణ స్కూల్‌లో బాలల ఎన్నికల సందడి
సైబరాబాద్ – విశాల భారతి
పుస్తకాల్లో చదువుకునే ప్రజాస్వామ్య పాఠాలను విద్యార్థులు ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకున్నారు. స్థానిక నారాయణ పాఠశాల ఎల్పీ విభాగంలో మంగళవారం నిర్వహించిన పాఠశాల క్యాబినెట్ ఎన్నికలు ఇందుకు వేదికగా నిలిచాయి. రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియలో విద్యార్థులు ఓటు విలువను, ఎన్నికల నిర్వహణ తీరును ప్రాక్టికల్‌గా తెలుసుకున్నారు. ఉదయం నుంచే విద్యార్థులు క్రమశిక్షణతో క్యూలైన్లలో నిలబడి, తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఉత్సాహంగా ఓటు వేశారు.
భావి భారత పౌరుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియపై అవగాహన కల్పించేందుకే ఈ ఎన్నికలను నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.కేవలం చదువుకే పరిమితం కాకుండా బాధ్యతాయుతమైన నాయకత్వం, క్రమశిక్షణ అలవర్చుకున్నప్పుడే సమాజంలో గొప్ప మార్పు తీసుకురాగలరని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియ తమకు ఎంతో కొత్త అనుభూతిని ఇచ్చిందని, ఒక మంచి నాయకుడిని ఎలా ఎన్నుకోవాలో తెలుసుకునే అవకాశం కలిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
