హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇళ్లపై ఏసీబీ మెరుపు దాడులు
– ఏకకాలంలో 12 చోట్ల సోదాలు
సైబరాబాద్ – విశాల భారతి
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇళ్లే లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఉదయం ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రవీందర్ తన అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని ఆదాయానికి మించిన ఆస్తులను భారీగా కూడబెట్టారనే నమ్మదగిన సమాచారంతో ఏసీబీ ఈ భారీ సోదాలకు శ్రీకారం చుట్టింది. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఈ తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి.
నానక్ రామ్ గుడా కేంద్రంగా సోదాలు..
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏసీబీ అధికారులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఒకే సమయంలో సుమారు 12 వేర్వేరు ప్రాంతాలలో సోదాలు ప్రారంభించారు. రవీందర్ నివసిస్తున్న నానక్‌రామ్‌గూడలోని సుమధుర అపార్ట్‌మెంట్స్ లోని నివాసంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బంధువులు, అత్యంత సన్నిహితులు, వ్యాపార భాగస్వాములకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నానక్‌రామ్‌గూడలోని సుమధుర అపార్ట్‌మెంట్స్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు కీలక ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి.
బహిర్గతమవుతున్న బినామీల గుట్టు..
హెచ్‌ఎండీఏలో కీలకమైన చీఫ్ ఇంజనీర్ హోదాలో ఉన్న రవీందర్ గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున అక్రమ పద్ధతుల్లో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే పక్కా ప్రణాళికతో దాడులు చేసిన అధికారులకు సుమధుర లొకేషన్‌తో సహా మరికొన్ని ప్రాంతాల్లో కీలక పత్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. అధికారులు ప్రస్తుతం రవీందర్, కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. అలాగే పలు బ్యాంకుల్లో ఉన్న ఖాతాల లావాదేవీలను, లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకుని తనిఖీలు చేస్తున్నారు. ఇళ్లలో లభ్యమైన నగదు, భారీ ఎత్తున ఉన్న బంగారు ఆభరణాల విలువను కూడా లెక్కిస్తున్నారు.
కొనసాగుతున్న సోదాలు..
ప్రస్తుతం ఏసీబీ బృందాల సోదాలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. డిజిటల్ డివైజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లను కూడా ఐటీ నిపుణుల సహాయంతో అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. లభ్యమైన అక్రమ ఆస్తుల పూర్తి విలువ మార్కెట్ ధరల ప్రకారం వందల కోట్లలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సోదాలు పూర్తిగా ముగిసిన తర్వాతే స్వాధీనం చేసుకున్న సొమ్ము, ఆస్తుల పూర్తి వివరాలపై ఏసీబీ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ దాడుల ఉదంతం ఇప్పుడు హెచ్‌ఎండీఏ వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత ప్రభుత్వ అధికారుల సర్కిల్స్‌లో తీవ్ర సంచలనంగా మారింది.
