లులు మాల్‌లో భద్రతా లోపం యాజమాన్యంపై కేసు
– లైసెన్స్‌డ్ పిస్టల్‌తో మాల్‌లోకి ప్రవేశం
– పోలీసుల విచారణ
సైబరాబాద్ – విశాల భారతి
కూకట్‌పల్లిలోని లులు మాల్‌లో భద్రతా వ్యవస్థలో లోపం వెలుగుచూసింది. మాల్ పార్కింగ్‌లో రెండు కుటుంబాల మధ్య మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఓ వ్యక్తి వద్ద లైసెన్స్ కలిగిన పిస్టల్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో మాల్ భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తాయి.పోలీసుల వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన సిద్ధిఖీ అనే వ్యక్తి ఘర్షణలో పాల్గొన్న వారితో కలిసి మాల్‌కు వచ్చినట్లు గుర్తించారు. విచారణ సమయంలో అతని వద్ద పిస్టల్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. తనిఖీ చేయగా ఆ ఆయుధానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉన్నట్లు తేలింది.అయితే బహిరంగ షాపింగ్ మాల్‌లో ఆయుధాలతో ప్రవేశించడం నిషేధం. ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, భద్రతా తనిఖీలు ఉన్నప్పటికీ ఆయుధంతో వ్యక్తి ఎలాంటి అడ్డంకులు లేకుండా మాల్‌లోకి ప్రవేశించడం భద్రతా వైఫల్యంగా పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు లులు మాల్ యాజమాన్యంపై క్రిమినల్ నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో లోపం ఎలా జరిగిందనే అంశంపై విచారణ కొనసాగుతోంది. అలాగే ఘర్షణకు దారితీసిన పరిస్థితులపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
