లాకర్‌ను టార్గెట్ చేసిన దొంగలు.. కోటి విలువైన బంగారం మాయం
– బాత్‌రూమ్ కిటికీ పగులగొట్టి కార్యాలయంలోకి చొరబడ్డ దుండగులు
– కోటి రూపాయల విలువైన నగలు అపహరణ
బంజారాహిల్స్- విశాల భారతి
రాజధానిలో దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రోడ్ నంబర్–10లో ఉన్న ఓ ఆభరణాల సంస్థ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని కిలోకు పైగా బంగారు ఆభరణాలను అపహరించారు. సుమారు 1,028 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో వాటి విలువ దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన వ్యాపార సంస్థకు చెందిన బంగారు ఆభరణాలను వజ్రాలు పొదిగే పనుల కోసం నగరానికి తీసుకొచ్చి గురుకృప ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలోని లాకర్‌లో భద్రపరిచారు. లాకర్‌లో ఏడు బంగారు హారాలు, ఏడు జతల చెవిపోగులు సహా విలువైన ఆభరణాలు ఉంచారు.సోమవారం ఉదయం సంస్థ ప్రతినిధులు కార్యాలయానికి వచ్చి లాకర్‌ను పరిశీలించగా అందులోని బంగారు ఆభరణాలు కనిపించలేదు. అనంతరం కార్యాలయం మొత్తం తనిఖీ చేయగా బాత్‌రూమ్ కిటికీ పగులగొట్టిన ఆనవాళ్లు గుర్తించారు. దీంతో దుండగులు అదే మార్గంలో లోపలికి ప్రవేశించి లాకర్‌లోని ఆభరణాలను అపహరించినట్లు అనుమానిస్తున్నారు.సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న ఆధారాల సేకరణ బృందం, శునక దళం వివిధ ఆధారాలను సేకరించింది. కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిఘా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఈ చోరీకి బయటి వ్యక్తులు పాల్పడ్డారా? లేక కార్యాలయ సిబ్బందిలో ఎవరికైనా ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
