నేషనల్ పోలీస్ అకాడమీలో కలకలం
– ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యాయత్నం
– లైంగిక వేధింపుల కేసు నమోదు అనంతరం ఘటన
– చికిత్స కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలింపు
రాజేంద్రనగర్ -విశాల భారతి:
హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఇటీవల నమోదైన లైంగిక వేధింపుల కేసు మరో కీలక మలుపు తిరిగింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అకాడమీ అధికారులు వెంటనే స్పందించి ఆయనను ఎర్రగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో అసభ్యకర సందేశాలు పంపడం, వేధింపులకు గురిచేయడం, వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి బాధితురాలి భర్తకు పంపినట్లు ఆరోపణలు చేసినట్లు తెలిసింది. ఈ ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కేసు నమోదైన వెంటనే నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులు ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.ఇదిలా ఉండగా, తనపై వచ్చిన ఆరోపణలను ఉదయ్ కృష్ణారెడ్డి ఖండించారు. “తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిజాలు త్వరలో వెలుగులోకి వస్తాయి” అనే భావంతో ఆయన తన వాట్సాప్ స్టేటస్‌లో సందేశం ఉంచినట్లు తెలిసింది. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.దేశంలో అత్యున్నత పోలీసు అధికారులకు శిక్షణ అందించే ప్రతిష్ఠాత్మక నేషనల్ పోలీస్ అకాడమీలో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
