వడ్డీ మాయలో వేల కోట్లకు టోకరా
– ‘కిసాన్ పరివార్’ పేరిట భారీ కుంభకోణం
– దేశవ్యాప్తంగా 6వేల మంది బలి
– సూత్రధారి భూపాల్ నాయక్ అరెస్ట్
– సీపీ కార్యాలయానికి బాధితుల క్యూ
సైబరాబాద్ – విశాల భారతి
అధిక వడ్డీ ఆశ చూపి అమాయకులను నమ్మించి కోట్లకు కోట్లు దండుకున్న ‘కిసాన్ పరివార్’ ఘరానా మోసం బట్టబయలైంది. కిసాన్ పరివార్, కిసాన్ పరివార్ లిమిటెడ్, కిసాన్ పరివార్ ఇండస్ట్రీస్, షేర్స్ బజార్ పేరిట సంస్థలు స్థాపించిన భూపాల్ నాయక్, అధిక వడ్డీలు ఇస్తామంటూ పెట్టుబడిదారులను వలలో వేసుకుని చివరికి బోర్డు తిప్పేశాడు. ఈ కుంభకోణంలో దేశవ్యాప్తంగా సుమారు 6 వేల మంది బాధితులు కాగా, రూ.6 వేల కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 1200 మంది వరకు మధ్యతరగతి ప్రజలు ఈ మోసానికి బలయ్యారు.ఈ భారీ స్కామ్‌పై గుజరాత్ పోలీసులు గతంలోనే భూపాల్ నాయక్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పది రోజుల క్రితం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిందితుడిని శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని గుజరాత్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడిని గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా, తమకు జరిగిన అన్యాయంపై బాధితులు శనివారం సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఈవోడబ్ల్యూ అధికారులను ఆశ్రయించారు. 2022 నుంచి ఈ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నామని, మొదట ఏడాది పాటు వడ్డీలు సక్రమంగా చెల్లించి నమ్మకం కలిగించి ఆ తర్వాత ముంచేశారని బాధితుడు సుభాష్ రెడ్డి మీడియా ఎదుట వాపోయాడు. ‘నా కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బులన్నీ ఎక్కువ వడ్డీ వస్తుందని ఇందులో పెట్టాను. వీళ్లు బోర్డు తిప్పేయడంతో అప్పులు చేసి పెళ్లి చేయాల్సి వచ్చింది. మాలాంటి మధ్యతరగతి వాళ్లంతా రోడ్డున పడ్డాం. ప్రభుత్వమే చొరవ తీసుకుని న్యాయం చేయాలి’ అని బాధితురాలు మాధవి కన్నీటిపర్యంతమయ్యారు.బాధితుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కంపెనీల పేరిట వేల కోట్లు వసూలు చేసిన ఈ భారీ స్కామ్‌పై ఈవోడబ్ల్యూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
