నవ్య జంక్షన్‌లో ట్రాఫిక్ మెరుగుదలకు కొత్త ఏర్పాట్లు
– ఫ్రీ లెఫ్ట్, యూ-టర్న్ సౌకర్యాలతో వాహనాల రాకపోకలకు ఊరట
సైబరాబాద్ – విశాల భారతి
నవ్య (ఐక్యత) జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు మార్పులు చేపట్టారు. గ్రీన్ మెడోస్ కాలనీ వైపు వెళ్లే వాహనదారుల సౌకర్యార్థం ఫ్రీ లెఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు సిగ్నల్ వద్ద ఎక్కువసేపు నిలిచిపోకుండా వేగంగా ప్రయాణించే అవకాశం కలిగింది. అలాగే బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ కోన్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల కదలిక క్రమబద్ధంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.ఇక బీరంగూడ నుంచి లింగంపల్లి వైపు వచ్చి అశోక్‌నగర్–పటాన్‌చెరు రోడ్ వైపు వెళ్లే వాహనాల కోసం ట్రయల్ ప్రాతిపదికన ట్రాఫిక్ కోన్స్, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి యూ-టర్న్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ మార్పుల వల్ల ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి వాహనాల రాకపోకలు మరింత సాఫీగా సాగుతాయని ట్రాఫిక్ పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులు వాహనదారులు కొత్త ట్రాఫిక్ ఏర్పాట్లను గమనించి ట్రాఫిక్ సిబ్బంది సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
