- యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోల్నేపల్లిలో వింత పరిస్థితి..
- ఎస్సీ కులాలను గుర్తించని అధికారులు, పార్టీలు, గ్రామంలోని పార్టీ పెద్దలు..
- 10 వార్డులలో ఒక్క స్థానం కూడా అవకాశం లేకపాయే
– జనరల్ స్థానాలలో కూడా ఎస్సిలకు దక్కని చోటు
– రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం కాలరాస్తున్న వైనం.
యాదాద్రి: యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోల్నేపల్లి గ్రామంలో ఎస్సి వర్గానికి చెందిన కులాలు రెండు ఉండగా 25శాతం ఓట్లు ఉన్నాయి.అయితే ఆ కులాన్ని గుర్తించేందుకు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేశారో ఏమో కానీ ఎస్సీలకు తీరని అన్యాయం చేశారు.ఒక్కటంటే ఒక్క వార్డు మెంబర్ రిజర్వేషన్ కూడా కల్పించకుండా వ్యవహరించారు.కనీసం పోటీలో ఉన్న పార్టీలు కూడా జనరల్ స్థానాలలో అయినా ఒక్క ఎస్సికి టికెట్ కేటాయించలేదు అంటే ఎస్సీ వర్గాలు అంటే గోల్నేపల్లి గ్రామంలో పార్టీలకు కానీ పార్టీల పెద్దలకు కానీ ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధం అవుతుంది. ఎలక్షన్స్ రాగానే అన్న జర నన్ను మరవకే నేను నిలబడుతున్న, అక్క జెర నన్ను పర్చిపోకు, కాకా మన పోరలకు చెప్పు అన్నకే ఓటెయ్యాలని అంటూ పోటీలో నిలబడిన వారి ప్రచారం అయితే… మనోడిని నిలబెట్టిన అన్నింటికీ నేనే ఉంటా అంటూ గ్రామంలో అధికారం కోసం తిష్ట వేసిన బడా నాయకులు ఎస్సి కాలనీలను పట్టి తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు.
అంటే ఎస్సీ వర్గీయుల ఓట్లు తప్ప వాళ్లకు సీట్లు ఇచ్చే చిత్తశుద్ధి వారికి లేకపాయే..ఇక్కడ మరోటి ఉంది. గ్రామానికి బిసి మహిళ రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ గా నిలబడే అవకాశం కోల్పోయాము అధికారం లేకపోతే ఎట్లా.. మనది ఎట్లున్నా అప్పర్ హ్యాండ్ ఉండాలని ఓ వర్గం బడా నాయకులు జనరల్ స్థానంలో గెలిచి ఉప సర్పంచ్ స్థానాన్ని చేజిక్కించుకునే స్వార్ధ ప్రయోజనంతో ఆ స్థానంలో ఎస్సిలకు స్థానం కల్పించకుండా తమ సామాజిక వర్గానికి ఇరు పార్టీల నుండి టికెట్ ఇప్పించుకొని కుటిల రాజకీయం చేస్తున్నారు. ఎస్సీలు ఓట్లకే తప్ప సీట్లకు పనికిరారు అన్నట్లుగా తమ కులం కోసం స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారు. సరే ఎస్సీల మీద తమకు ఎలాంటి నిర్లక్ష్యం లేకపోతే గ్రామంలో ఐదు జనరల్ స్థానాలు వచ్చాయి.అందులో ఎందుకు ఏ ఒక్క స్థానంలోనైన ఎస్సీ వర్గాలకు అవకాశం కల్పించలేదు.ఎందుకంటే ఎస్సీ వర్గం అంటే వారికి ఎనలేని నిర్లక్ష్యం.అధికార దాహంతో ఉన్న బహుముఖ పెద్దమనుషులను నమ్మి వెంట తిరిగే ఎస్సి వర్గాలు నిరాశతో ఏమీ ప్రశ్నించలేని దీన స్థితిలో ఎందుకు ఉన్నారు. మాకెందుకు స్థానం కల్పించరు అని ఎందుకు ఎదురుతిరగడం లేదు…చదువు ఉంది, ఆలోచన ఉంది. పాలించే సత్తా ఉంది మరి మేము దేనికి తక్కువ అని ఎందుకు ప్రశ్నించడం లేదు.ఓట్లకు తప్ప సీట్లకు పనికిరారు అని నిర్దారించి తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తమ వెంట ఎస్సీ వర్గాలను తిప్పుకుంటున్న ఆ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎందుకు గుర్తించడం లేదు. ఏ నాడైన అడగనిదే చిన్న లైట్ వేసిన పరిస్థితి లేదని గుర్తుంచుకోవాలి.పరిస్థితి చేయిజారిపోయింది. కానీ ఇప్పటికైనా మేల్కొనండి.రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా హరిస్తూ ఎస్సీ వర్గాలకు రిజర్వేషన్ రాకుండా తప్పులు తడక రిపోర్టులు ఇచ్చి ఈ పరిస్థితి రావడానికి కారుకులైన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఉన్న కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.
