ఖమ్మం బ్యూరో, విశాలభారతి: తెలంగాణ రాష్ట్రంలో ఇసుక విక్రయాల్లో పారదర్శకత పెంచడానికి.. అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం వినూత్న మార్పులు చేస్తోంది. ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెడుతూ.. సామాన్యులకు తక్కువ ధరకే ఇసుకను చేరవేయడమే లక్ష్యంగా ‘ మన ఇసుక వాహనం ’ అనే నూతన ఆన్‌లైన్ విధానాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. దీని ద్వారా వినియోగదారులు నేరుగా మొబైల్ యాప్ సహాయంతో తమకు కావాల్సిన ఇసుకను బుక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు ఇసుకను బుక్ చేసుకోవచ్చు.
ఈ నూతన విధానాన్ని ప్రాథమికంగా కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ జిల్లాల్లో లభించే ఫలితాలను బట్టి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. వినియోగదారులు ‘మన ఇసుక వాహనం ’ యాప్ డౌన్ లోడ్ చేసుకుని తమ వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేని పక్షంలో.. స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి కూడా ఇసుకను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోపు వినియోగదారుడి ఇంటి వద్దకే ఇసుకను సరఫరా చేస్తారు. ఇసుక లోడ్‌తో బయలుదేరిన ప్రతి వాహనానికి జీపీఎస్ పరికరాన్ని అమర్చుతారు. దీనివల్ల వాహనం ఏ మార్గంలో వెళుతోంది..? ఎక్కడ ఆగుతోంది అనే వివరాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించవచ్చు. నేరుగా ప్రభుత్వ పోర్టల్ ద్వారా బుకింగ్ జరగడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. దూరాన్ని బట్టి ధరలను నిర్ణయించడం వల్ల వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడదు.
అక్రమ మార్గాల్లో తరలిపోతున్న ఇసుక సొమ్ము నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. గత ఏడాది రూ. 738 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అది రూ. 1,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి *రెవెన్యూ, పోలీస్, రవాణా, మైనింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో 2017లో పెద్దపల్లి జిల్లాలో ‘స్యాండ్ టాక్సీ ’ పేరుతో ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అది నిలిచిపోయింది. కానీ ఇప్పుడు టెక్నాలజీని జోడించి మరింత పకడ్బందీగా దీనిని అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు, ఆర్డీవోలు అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా ఇసుక అవసరం ఉన్న పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరగనుంది.
