సీఎంసీ నూతన లోగో ఆవిష్కరణ
– పర్యావరణం.. జల సంరక్షణకు ప్రతీకగా రూపకల్పన
సైబరాబాద్,విశాల భారతి
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) నూతన లోగోను అధికారులు విడుదల చేశారు. ఆధునిక రూపకల్పనతో పాటు పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, ప్రజా సంక్షేమాన్ని ప్రతిబింబించేలా ఈ లోగోను రూపొందించారు. నీలం, ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన లోగోలో ‘సీఎంసీ’ అక్షరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.లోగో మధ్యభాగంలో హృదయాకారంలో నీటి బొట్టును ఏర్పాటు చేయడం ద్వారా నీటి సంరక్షణకు ప్రాధాన్యాన్ని చాటారు. దాని పైభాగంలో మూడు ఆకులను పొందుపరచి పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా రూపొందించారు. లోగో దిగువన ఆకుపచ్చ రంగు బ్యాండ్‌పై ‘సైబరాబాద్’, దాని కింద ‘మున్సిపల్ కార్పొరేషన్’ అనే పేరును పొందుపరిచారు.
సైబరాబాద్ ప్రాంతంలో సరికొత్త అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, జల వనరుల సంరక్షణతో పాటు సుస్థిర పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యాలను ప్రతిబింబించేలా నూతన లోగోను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. సీఎంసీ భవిష్యత్ కార్యాచరణకు ఈ లోగో ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
