సెలూన్ ఓపెనింగ్‌లో వసూళ్ల పంచాయితీ!
– డబ్బులు ఇవ్వలేదని బెదిరింపులు
– ట్రాన్స్‌జెండర్లకు జీడిమెట్ల పోలీసుల గట్టి హెచ్చరిక
సైబరాబాద్ – విశాల భారతి
గాజులరామారం బాలాజీలేఅవుట్‌లోని ఓ సెలూన్ ప్రారంభోత్సవం సందర్భంగా డబ్బులు డిమాండ్ చేసి యజమానిని బెదిరించిన ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రారంభోత్సవానికి వెళ్లిన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు డబ్బులు ఇవ్వాలని యజమానిని కోరినట్లు, ఆయన నిరాకరించడంతో తమ సమాజానికి చెందిన వారిని తీసుకొచ్చి న్యూసెన్స్ చేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సోమవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్ సమాజ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రారంభోత్సవాలు, గృహప్రవేశాలు, పండుగలు, ఇతర వేడుకల సమయంలో గుంపులుగా వెళ్లి డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాల్పడటం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు పాల్పడవద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టాన్ని గౌరవిస్తూ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని జీడిమెట్ల ఎస్‌హెచ్‌ఓ కె. రవికుమార్ స్పష్టం చేశారు.
