నేరగాళ్లకు పోలీసుల చెక్
– 5 కేసులు ఛేదన, రూ.19 లక్షల సొత్తు లభ్యం
* రెండు రోజుల్లోనే జగద్గిరిగుట్ట కేసుల గుట్టురట్టు
* నిందితుల అరెస్టు
సైబరాబాద్ – విశాల భారతి
జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఐదు వేర్వేరు కేసులను పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే విజయవంతంగా ఛేదించారు. నేరాలకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.9 లక్షల నగదు, 3.5 తులాల బంగారం, మరికొన్ని వెండి వస్తువులు, మొబైల్ ఫోన్ తో పాటు రూ.10 లక్షల విలువైన బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్ డీసీపీ ఆదేశాల మేరకు ఏసీపీ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ సురేష్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నరేంద్రరెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందాలు వేగంగా దర్యాప్తు జరిపి ఈ సొత్తును స్వాధీనం చేసుకున్నాయి.బాధితురాలిని నమ్మించి మోసానికి పాల్పడిన కేసులో మార్కాపురానికి చెందిన కామినెడ్డి శివమోహన్‌రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ అవసరాలు, ఆసుపత్రి ఖర్చుల పేరుతో ఓ మహిళ వద్ద నుంచి రూ.9 లక్షల నగదు, 3.5 తులాల బంగారాన్ని తీసుకుని అతడు పరారయ్యాడు. ఆ బంగారాన్ని కంభంలోని కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.మరో ఘటనలో అస్బెస్టాస్ కాలనీలో వరుస ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న గరికపాటి వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు మూడు ఇళ్లలో చొరబడి మొబైల్‌ఫోన్, వెండి వస్తువులు, 3 గ్రాముల బంగారం, రూ.60 వేల నగదును దొంగిలించినట్లు స్పష్టమైంది.అలాగే ఈవీ ఛార్జింగ్ కేంద్రంలో జరిగిన చోరీ కేసులో అక్కడ పనిచేస్తున్న తోట గురువప్ప అనే ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కోటి రూ.2.50 లక్షల విలువ చేసే నాలుగు బ్యాటరీలను దొంగిలించి స్క్రాప్ దుకాణంలో విక్రయించగా, రూ.10 లక్షల విలువైన ఆ బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే వరుస కేసులను ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
