A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఖాకీ ముసుగులో కోట్ల దందా

0 330

ఖాకీ ముసుగులో కోట్ల దందా
– డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల చిట్టా
– ఏసీబీ సోదాల్లో బట్టబయలు 15 చోట్ల భారీగా నగదు, బంగారం, ఆస్తులు

రాజేంద్రనగర్ – విశాల భారతి
అధికారం అడ్డంపెట్టుకుని ఆదాయానికి మించి కోట్లకు పడగలెత్తిన ఓ పోలీస్ అధికారి బండారం బట్టబయలైంది. తెలంగాణ పోలీసు కంప్యూటర్ సేవల విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డి అక్రమాస్తుల పర్వం అవినీతి నిరోధక శాఖ దాడులతో వెలుగుచూసింది. అవినీతి నిరోధక చట్టం, 1988 సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూలై 2న తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. డీఎస్పీ నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర అనుబంధ వ్యక్తులకు చెందిన 15 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ తనిఖీలు చేశారు. ప్రతిచోటా ఆస్తుల చిట్టా బయటపడటంతో అధికారులు విస్తుపోయారు.

నగరంలో విల్లాలు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాలు…
ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో విలాసవంతమైన విల్లా, టెలికాంనగర్‌లో రెండు అంతస్తుల భవనంతో పాటు పెంట్‌హౌస్, అదే ప్రాంతంలో సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాటు, గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్స్‌లో మరో ఫ్లాటును గుర్తించారు. మణికొండ లాంకోహిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల ఐదు అంతస్తుల వాణిజ్య సముదాయంలో వాటా, మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం కూడా ఉన్నట్లు తేలింది. తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు ఉన్నట్లు నిర్ధారించారు.

రెండు రాష్ట్రాల్లో విస్తరించిన భూములు…
ప్రగతి రిసార్ట్స్‌లో 500 చదరపు గజాల ఖాళీ స్థలం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో 6 ఎకరాలు, మరోచోట 38 ఎకరాల భూములు ఉన్నాయి. బెంగళూరు దేవనహళ్లిలో 1 ఎకరం భూమి, నాగోల్‌లో కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల స్థలం, జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాల స్థలం, పటాన్‌చెరులో 200 చదరపు గజాల స్థలం లభించాయి. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో 1000 చదరపు గజాల భూమి, 2 ఎకరాల వ్యవసాయ భూమి, ముచింతల గ్రామంలో 4.20 ఎకరాల భూమి ఉన్నట్లు పత్రాలు వెల్లడించాయి.

పరిశ్రమలో పెట్టుబడులు, నగదు నిల్వలు..
మెస్సర్స్ శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్‌లో 75 లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు లభించాయి. సోదాల సమయంలో డీఎస్పీ నివాసంలో 3.60 లక్షల నగదు, బినామీ ఇంట్లో 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, బ్యాంకు ఖాతాల్లో సుమారు 19.91 లక్షల నిల్వలు ఉన్నట్లు తేలింది.ఈ ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ పత్రాలలో చూపిన విలువ కంటే పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బినామీ పేర్లతో కొనుగోళ్లు జరిగినట్లు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.