అర్ధరాత్రికి రాత్రి తల్లి ఒడి ఖాళీ
– లింగంపల్లిలో నెల వయసు పసికందు కిడ్నాప్
– సీసీ కెమెరాలో బట్టబయలు
సైబరాబాద్ – విశాల భారతి
కన్నతల్లి ఒడిలో హాయిగా నిద్రిస్తున్న నెల రోజుల పసికందును ఓ దుండగుడు అర్ధరాత్రి ఎత్తుకెళ్లిన ఘటన లింగంపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో కలకలం రేపింది. గురువారం ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఉదంతంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు. లింగంపల్లి ప్రాంతంలో సర్కస్‌లు చేస్తూ జీవనం సాగించే దంపతులు తమ నెల రోజుల పాపతో కలిసి రైల్వేస్టేషన్ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుంటారు. గత నెల 30న రాత్రి తల్లి పాపను ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రించింది. అర్ధరాత్రి మెలకువ వచ్చి చూసేసరికి కన్నబిడ్డ కనిపించకపోవడంతో ఆ తల్లి గుండె పగిలేలా రోదించింది. భర్తతో కలిసి చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది.దిక్కుతోచని స్థితిలో చందానగర్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. స్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, అర్ధరాత్రి ఓ ఆటోలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి తల్లి పక్కనే నిద్రిస్తున్న పసికందును మెత్తగా ఎత్తుకొని వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. దీంతో ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు.నిందితుడిని పట్టుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. కిడ్నాప్ చేసిన శిశువును చాంద్రాయణగుట్టలోని సంతానం లేని దంపతులకు విక్రయించినట్లు తేలింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పాపను సురక్షితంగా రక్షించి, కొనుగోలు చేసిన దంపతులతో పాటు కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పసికందును తల్లికి అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు.
