డ్రై డేతోనే దోమలకు చెక్
– డీసీ చాముండేశ్వరి
– రెయిన్‌బో స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన
– పాపి రెడ్డి నగర్‌లో భారీ ర్యాలీ
సైబరాబాద్ – విశాల భారతి
డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి విషజ్వరాలు ప్రబలకుండా ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ కార్యక్రమాన్ని పకడ్బందీగా పాటించాలని ఆల్విన్ కాలనీ సర్కిల్-51 డీసీ చాముండేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎంసీ ఆదేశాల మేరకు వెంకటేశ్వర నగర్ వార్డు పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలో శుక్రవారం డ్రై డే కార్యక్రమం విస్తృతంగా చేపట్టారు. డీసీ చాముండేశ్వరి ఆధ్వర్యంలో రెయిన్‌బో హైస్కూల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ ‘దోమల వృద్ధికి నిల్వ నీరే ప్రధాన కారణం. ప్రతి ఇంట్లో శుక్రవారం నాడు అరగంట కేటాయించి టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూలకుండీలు, ఫ్రిజ్ ట్రేలు, పాత కుండల్లో నిల్వ ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలి. ఒక్క దోమ 300 గుడ్లు పెడుతుంది. వారం రోజుల్లోనే అవి దోమలుగా మారి వ్యాధులు వ్యాపిస్తాయి. మీ ఇంటిని మీరే కాపాడుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.ఎంటమాలజీ సిబ్బంది విద్యార్థులకు ఏడిస్, అనాఫిలిస్, క్యూలెక్స్ దోమల రకాలు, వాటి జీవిత చక్రాన్ని ప్రత్యక్షంగా వివరించారు. కూలర్, టైరు, కొబ్బరి చిప్ప, కుండల నమూనాల్లో దోమలు గుడ్లు పెట్టే విధానాన్ని చూపించారు.అనంతరం ఏఎంఓహెచ్, ఎంటమాలజీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆర్‌డబ్ల్యూఏ సభ్యులతో కలిసి విద్యార్థులు పాపిరెడ్డి నగర్ కాలనీ వీధుల్లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ‘నీటి నిల్వను అరికడదాం – దోమలను తరిమికొడదాం’, ‘ప్రతి శుక్రవారం డ్రై డే – ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కాలనీవాసులకు కరపత్రాలు పంచి ఇంటింటికీ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్కూల్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
