డీసీ హెచ్చరిక బేఖాతరు.. చెత్త అక్కడే
– ఎల్లమ్మ ఆలయం వద్ద గ్రీన్ వేస్ట్ తొలగింపులో అలసత్వం
– పారిశుద్ధ్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
సైబరాబాద్ – విశాల భారతి
పారిశుద్ధ్య తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆల్విన్ కాలనీ సర్కిల్-51 ఉప కమిషనర్ చాముండేశ్వరి హైదర్‌నగర్ జాతీయ రహదారిపై ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద తనిఖీలు చేపట్టారు. ఆలయం ఎదుట రోడ్డుపై గుట్టలుగా పేరుకుపోయిన గ్రీన్ వేస్ట్‌ను చూసి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక ఎస్ఎఫ్ఏ సిబ్బందిని పిలిపించి చెత్తను తొలగించాలని హెచ్చరించారు.అయితే డీసీ హెచ్చరించి 24 గంటలు గడుస్తున్నా శనివారం ఉదయం నాటికి పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. చెత్త కుప్ప యథాతథంగా రోడ్డుపైనే ఉండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు వచ్చి హెచ్చరించి వెళ్లినా సిబ్బందిలో చలనం లేదు. దేవాలయం ముందు ఇలా చెత్త కుప్పలు ఉంటే భక్తులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఇలా అయితే ఎలా?’ అంటూ స్థానికులు మండిపడ్డారు. ప్రధాన రహదారిపై నిత్యం వందలాది వాహనాలు తిరిగే చోట, దేవాలయం వద్ద ఇలా చెత్త ఉండటం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, వెంటనే తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
