డ్రగ్స్ నిర్మూలనలో సైబరాబాద్ పోలీసులకు డీజీపీ కితాబు
– అన్ని యూనిట్లతో వీడియో సమావేశం నిర్వహించిన డీజీపీ ఆనంద్
– సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన
సైబరాబాద్ – విశాల భారతి
రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం అన్ని యూనిట్ల అధికారులు, పోలీస్ స్టేషన్‌హౌస్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ కమిషనర్‌తో పాటు కమిషనరేట్‌కు చెందిన డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, స్టేషన్‌హౌస్ అధికారులు పాల్గొన్నారు.నేరం, నేరస్తుల ట్రాకింగ్ నెట్‌వర్క్ వ్యవస్థ, ఈ-సాక్ష్యం వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను పూర్తి స్థాయిలో అమలు చేసి, ప్రతి కేసులో డిజిటల్ ఆధారాలను సమర్థంగా వినియోగించాలని డీజీపీ సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రత, పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయడం, ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో సైబరాబాద్ కమిషనర్, కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న ప్రత్యేక చర్యలు, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన కార్యాచరణలు, నేర నియంత్రణ చర్యలు, కనిపించే పోలీసింగ్ కార్యక్రమాలను వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో సైబరాబాద్ పోలీసులు సాధిస్తున్న ఫలితాలను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.
