బాగ్యానగర్ కాలనీలో డోర్ టు డోర్ సేకరణ తనిఖీ
– జయానగర్‌లో దెబ్బతిన్న మ్యాన్‌హోల్ పనుల పరిశీలన
– సమస్యను వాటర్‌బోర్డు దృష్టికి తీసుకెళ్లిన జీహెచ్‌ఎంసీ అధికారులు
సైబరాబాద్ – విశాల భారతి
ఆల్వీన్ కాలనీ సర్కిల్-51 పరిధిలోని పారిశుధ్య పనులను సీఎంసీ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాగ్యానగర్ కాలనీలో సాగుతున్న ఇంటింటి చెత్త సేకరణ తీరును డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి స్వయంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుతో పాటు తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. కాలనీలో 100 శాతం కవరేజీ సాధించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పారిశుధ్య సిబ్బందిని హెచ్చరించారు.
ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్..
మరోవైపు జయానగర్ ప్రాంతంలో దెబ్బతిన్న మ్యాన్‌హోల్‌పై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన అధికారులు విరిగిపోయిన మ్యాన్‌హోల్ మూతను పరిశీలించారు.వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా వెంటనే అక్కడ రాళ్లు అమర్చి, ఎర్ర గుడ్డతో బారికేడింగ్ ఏర్పాటు చేశారు.ఈ విషయమై జలమండలి (HMWS&SB) అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు డిసి తెలిపారు. పారిశుధ్య ఇన్‌స్పెక్టర్, ఫీల్డ్ అసిస్టెంట్లు జలమండలి సిబ్బందితో సమన్వయం చేసుకుని మ్యాన్‌హోల్ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
