హైదర్‌షాకోట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
– రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
రాజేంద్రనగర్ – విశాల భారతి
హైదర్‌షాకోట్‌లోని ఎస్‌ఎంపీ పాఠశాల సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. అతివేగంగా వచ్చిన మహీంద్రా ఎస్‌యూవీ 300 కారు రోడ్డుపై వెళ్తున్న హైదర్‌షాకోట్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.అదే సమయంలో రాపిడో బైక్‌పై వెళ్తున్న ఇద్దరినీ కారు ఢీకొనడంతో వారు గాయపడ్డారు. వారిలో ఒకరికి కాలు విరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
కారు వదిలి పరారీ..
ప్రమాదం అనంతరం కారులో ఉన్న నలుగురు యువకులు వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు నంబరు ఆధారంగా వివరాలు సేకరించగా.. అది శంషాబాద్‌కు చెందిన వాహనంగా గుర్తించినట్లు సమాచారం.
మద్యం మత్తులో ఉన్నారా..?
కారు అత్యంత వేగంగా రావడంతో రహదారిపై ప్రయాణిస్తున్నవారు భయాందోళనకు గురయ్యారు. కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉండి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై పోలీసుల నుంచి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
