నకిలీ డాక్టర్ అరెస్ట్
– బోగస్ క్లినిక్‌పై పోలీసుల మెరుపు దాడి
అబ్దుల్లాపూర్‌మెట్ – విశాల భారతి
డిగ్రీ లేదు, అనుమతులు లేవు. అయినా డాక్టర్ అవతారం ఎత్తి అమాయకులకు వైద్యం పేరుతో చికిత్స చేస్తున్న ఓ నకిలీ వైద్యుడి గుట్టును నాగోల్ పోలీసులు రట్టు చేశారు. అజయ్‌నగర్‌లో సాయి సాత్విక్ క్లినిక్ పేరుతో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న వైద్య వ్యాపారంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్లినిక్ నిర్వాహకుడు అకుల కిషోర్ కుమార్ (44)ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. క్లినిక్‌కు గానీ, మందుల దుకాణానికి గానీ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని తేలింది. అయినప్పటికీ స్టెతస్కోప్ మెడలో వేసుకొని, బీపీ చెక్ చేస్తూ, ఇంజెక్షన్లు ఇస్తూ రోగుల నుంచి డబ్బులు గుంజుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
దాడుల్లో బీపీ యంత్రం, థర్మామీటర్లు, 40 సిరంజీలు, 8 ఇంజెక్షన్లు, ప్రిస్క్రిప్షన్ బుక్, మొబైల్ ఫోన్ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తప్పవని, అలాంటి వారి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ఆయన హెచ్చరించారు.
