ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
– రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ నేతల ఆరోపణ
షాద్‌నగర్,విశాల భారతి
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిపై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నలమోని శ్రీధర్ సీఐ సీతారాంకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు.మంగళవారం షాద్‌నగర్ చౌరస్తాలో సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘రాళ్లతో బట్టలు ఊడదీసి కొట్టి చంపాలి’ అంటూ ప్రజలను, ఇతరులను రెచ్చగొట్టేలా మాట్లాడారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు.శాంతియుత వాతావరణంలో ఉన్న ప్రాంతాన్ని తన ప్రసంగాలతో రెచ్చగొడుతున్నారని, సాక్షాత్తు ఎమ్మెల్యేనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం అప్రజాస్వామికమని ఫిర్యాదులో ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాల్లో సరికాదని, ఎమ్మెల్యే శంకర్‌పై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.వివాదాస్పద వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీఖాన్ బాబర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, గిరిజన రాష్ట్ర నాయకులు రఘునాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, శ్రీశైలం గౌడ్, డాకం మనీష్, ముబారక్ అలీఖాన్, బాలు నాయక్, రోమియో రమేష్, నాని, లింగాడిగూడ ఉప సర్పంచి అశోక్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
