శేరిలింగంపల్లి మాజీ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ మళ్లీ అరెస్ట్
– గచ్చిబౌలి ఫ్లాట్‌లో రూ. 56 లక్షల నగదు సీజ్
– బెదిరించి రెండు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్
సైబరాబాద్ – విశాల భారతి
భూకబ్జాలు, అవినీతి అక్రమాల కేసులో శేరిలింగంపల్లి మాజీ డిప్యూటీ కలెక్టర్ (తహసీల్దార్) ఏ. వంశీమోహన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం మళ్లీ అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో పాటు బినామీల పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు.
ఈ దాడుల్లో గచ్చిబౌలిలోని ఆయన నివాసం నుంచి రూ. 56 లక్షల భారీ నగదుతో పాటు కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అర్ధరాత్రి నుంచి ఏసీబీ మెరుపు దాడులు..
శేరిలింగంపల్లి మండలంలో వంశీమోహన్ తహసీల్దార్‌గా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆయనపై నిఘా ఉంచిన అధికారులు, వంశీమోహన్‌తో పాటు ఆయన బినామీలుగా అనుమానిస్తున్న వారి ఇళ్లపై గురువారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. గచ్చిబౌలిలోని వంశీమోహన్ లగ్జరీ ఫ్లాట్‌తో పాటు కూకట్‌పల్లి, మాదాపూర్, శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లోని ఆయన బినామీల ఇళ్లలో సోదాలు కొనసాగాయి.
గచ్చిబౌలి ఫ్లాట్‌లో రూ. 56 లక్షల నగదు లభ్యం..
గచ్చిబౌలిలోని వంశీమోహన్ సొంత ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించిన అధికారులకు భారీగా నగదు దొరకడం కలకలం రేపింది. ఎలాంటి లెక్కలు చూపని రూ. 56 లక్షల లిక్విడ్ క్యాష్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు పలు ఖరీదైన బంగారు ఆభరణాలు, విదేశీ కరెన్సీ, ప్రామిసరీ నోట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
బలవంతపు రిజిస్ట్రేషన్లు.. బెదిరించి ల్యాండ్ గ్రాబింగ్…
ఏసీబీ జరిపిన ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శేరిలింగంపల్లి పరిధిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండు విలాసవంతమైన ఫ్లాట్లను వంశీమోహన్ బాధితులను బెదిరించి, బలవంతంగా తన పేరు మీద రాయించుకున్నట్లు అధికారులు గుర్తించారు.
బాధితుల నుంచి ఫిర్యాదులు..
భూ వివాదాలను పరిష్కరిస్తానని నమ్మించి, లేదా అధికార బలంతో బెదిరించి కోట్లాది రూపాయల విలువైన ల్యాండ్స్, ఫ్లాట్లను తన బినామీల పేరిట మార్పించుకున్నట్లు ఏసీబీ విచారణలో ఆధారాలు లభించాయి.
> బినామీల ఇళ్లలో గుట్టలుగా ఆస్తుల పత్రాలు..
వంశీమోహన్‌కు అత్యంత ఆప్తులుగా ఉన్న ఇద్దరు వ్యాపారవేత్తలు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇళ్లలో కూడా ఏసీబీ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. వీరంతా వంశీమోహన్ బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. వారి ఇళ్లలో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించగా.. రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడులు, వందల ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ స్పేస్‌లకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. వీటి మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మళ్లీ కటకటాల్లోకి…
గతంలోనూ ఒకసారి అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన వంశీమోహన్, మళ్లీ అదే తరహా అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడటం రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆస్తుల తనిఖీలు పూర్తికావడంతో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన బినామీల బ్యాంక్ అకౌంట్లను కూడా నిలిపివేయాల్సిందిగా (ఫ్రీజ్) బ్యాంకులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
