విశాలభారతి, స్టేట్ బ్యూరో: రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా క్లాక్ టవర్ వద్ద ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ప్రజలను కలిసి వారి సమస్యలు,అభ్యర్థనలను స్వీకరించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విన్నారు,తక్షణమే పరిష్కరించగల అంశాలను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అనంతరం నల్లగొండ మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ సుందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దుబ్బ రూపా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దుబ్బ రూప కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సేవలో అహర్నిశలు కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు. ఆమె మృతి పార్టీకి,ప్రజలకు తీరనిలోటు అని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అలానే నల్లగొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి బైపాస్ వద్ద హోటల్ వింటేజ్ను మంత్రి ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో,హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్ల స్థాయిలో ఉన్న సదుపాయాలతో నల్లగొండలో హోటల్ ఏర్పాటు కావడం ఆనందకరమని మంత్రి పేర్కొన్నారు. హోటల్ నిర్వాహకులు ఫాజిల్,ఆదిల్ మరియు వారి బృందాన్ని మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. హోటల్ నిర్వహణలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని శుభ్రత,నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు జారీ కేంద్రం భవనంను ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా దివ్యాంగులకు సులభంగా,వేగంగా గుర్తింపు కార్డులు జారీ చేసే సదుపాయం లభించనుందని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఇది మరో ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ,రాత్రి పగలు పనిచేసి ధాన్యం సేకరణను పూర్తిచేయాలని ఆదేశించారు. రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని,రైతులను తేమ,తరుగు,తాలు పేర్లతో ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు,ప్యాడి క్లీనర్లు,తేమ యంత్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పత్తి కొనుగోలు నిబంధనల సడలింపుపై కేంద్రానికి నివేదిక పంపామని,బాయిల్డ్ రైస్ కోటా,బకాయిల విషయంలో ముఖ్యమంత్రితో,ఎఫ్సీఐ అధికారులతో చర్చిస్తామని తెలిపారు.
