మంత్రిగారి రూ. 58 లక్షల ‘బాత్‌రూమ్’ పునరుద్ధరణపై వెల్లువెత్తుతున్న విమర్శలు..!
సైబరాబాద్ – విశాల భారతి
రాష్ట్ర రోడ్ల పునర్నిర్మాణం, ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు నిధుల కొరత ఉందంటూ తరచూ ప్రకటించే ప్రభుత్వం, ఓ మంత్రి నివాసంలోని బాత్‌రూమ్ రిపేర్లకు మాత్రం భారీగా నిధులు కేటాయించడం తీవ్ర సంచలనంగా మారింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్ క్వార్టర్స్‌లోని ఒక మంత్రిగారి నివాసానికి సంబంధించి బాత్‌రూమ్ రిపేర్లు, ఇతర ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి అక్షరాలా రూ. 58,68,669
కేటాయిస్తూ విడుదల చేసిన ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఉద్యోగులకు ‘పైసా లేదు’.. మంత్రికి ‘లావిష్ ట్రీట్‌మెంట్’..?
పిఆర్‌సి బకాయిలు, డిఏల విడుదలతో పాటు హెల్త్ కార్డులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం వేలమంది ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న తరుణంలో ఈ జీవో వెలువడడం గమనార్హం. ఉద్యోగుల జీతభత్యాలు, బకాయిలు చెల్లించాలని కోరినప్పుడల్లా “ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత ఉంది, నన్ను కోసినా ఒక్క రూపాయి రాదు” అంటూ ఉచిత సలహాలు, ప్రకటనలు ఇచ్చే ప్రభుత్వ పెద్దలు, ప్రజాధనంతో ఈ స్థాయిలో విలాసవంతమైన మరమ్మతులకు ప్రజాధనాన్ని వెచ్చించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
బాత్‌రూమ్‌కు రూ. 58 లక్షలా..?
సాధారణంగా ఒక కొత్త ఇల్లు కట్టడానికే రూ. 50 నుంచి 60 లక్షల వరకు ఖర్చవుతున్న ప్రస్తుత రోజుల్లో, కేవలం క్వార్టర్స్‌లోని బాత్‌రూమ్ ఇతర చిన్నచిన్న రిపేర్లకు ఈ స్థాయిలో వ్యయం చేయడం వెనుక ఆంతర్యమేమిటని పౌరసమాజం, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.రోడ్ నెంబర్ 12 మినిస్టర్ క్వార్టర్స్… ఎల్‌డబ్ల్యూడీ లేదా రహదారులు-భవనాల (ఆర్ అండ్ బి ) శాఖ నిధుల ద్వారా ఈ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు సమాచారం.ఆధునిక హంగులు,
విదేశీ ఇంటీరియర్ ఫిట్టింగ్స్, ఇటాలియన్ మార్బుల్స్, హైటెక్ బాత్‌రూమ్ ఎక్విప్‌మెంట్ పేరుతో ఈ మొత్తాన్ని ప్రతిపాదించినట్లు విమర్శలు వస్తున్నాయి.
ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల తీవ్ర నిరసన…
“ప్రజల సంక్షేమం, ఉద్యోగుల హక్కులు పక్కనబెట్టి, ప్రజాప్రతినిధులు తమ స్వంత నివాసాల విలాసాలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలబెడుతున్నారు” అని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. నిధుల కొరత పేరిట సామాన్యులపై భారం మోపుతున్న ప్రభుత్వం, ఈ స్థాయి ఖర్చులపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని విపక్షాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
