వివేకానంద నగర్‌లో బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభం
– ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువు కావాలి
– ఎన్. రామచంద్రరావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు
కూకట్ పల్లి – విశాల భారతి
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయాలు వేదికగా నిలవాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, రాష్ట్ర సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆదివారం వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. నూతన కార్యాలయం ప్రజా సేవే లక్ష్యంగా కేంద్ర బిందువుగా మారాలని, కార్యకర్తలు సేవాభావంతో ప్రజల మధ్య ఉంటూ పనిచేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త పార్టీకి బలమైన సైనికుడిలా పనిచేయాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని, నూతన కార్యాలయం ద్వారా డివిజన్‌లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి రాబోయే రోజుల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మాధవరం కాంతారావు, రాష్ట్ర నాయకుడు నరేష్, వివిధ జిల్లాల నాయకులు, నియోజకవర్గ, డివిజన్ కమిటీల ప్రతినిధులు, వివిధ మోర్చాల పదాధికారులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
