భద్రాద్రి ప్రతినిధి, విశాలభారతి: ఆళ్లపల్లి మండల పర్యటనలో భాగంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వ హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు అందుతున్న వైద్య సేవల స్థితిగతులపై సమగ్రంగా పరిశీలించారు.హాస్పిటల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు, డాక్టర్లు మరియు సిబ్బంది అందిస్తున్న సేవలు, వసతుల నాణ్యతపై వివరంగా అడిగి తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం హాస్పిటల్‌లోని స్టోర్ రూమ్, ల్యాబ్‌లను తనిఖీ చేసి, ఔషధాల లభ్యత, వైద్య పరికరాల స్థితి, పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ముఖ్యంగా హాస్పిటల్ ప్రాంగణ భద్రత దృష్ట్యా ప్రహరీ గోడ నిర్మాణం అత్యవసరమని గుర్తించి, ఇందుకు సంబంధించిన అంశంపై ఐటిడిఏ అధికారులతో మాట్లాడి నిధుల మంజూరుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా పట్టణ స్థాయి వైద్య సేవలు అందించడమే మా లక్ష్యం. ఆసుపత్రుల అభివృద్ధిలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు.ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని ఎమ్మెల్యే ఆదేశించారు తెలిపారు..
