A place where you need to follow for what happening in world cup

- Advertisement -

అధికార పార్టీ నేతపై అత్యాచారం కేసు

0 584

అధికార పార్టీ నేతపై అత్యాచారం కేసు
– మూడు రోజులు దాచిపెట్టిన పోలీసులు
– నిందితుడి అరెస్టును గోప్యంగా ఉంచడంపై విమర్శలు
– రాజకీయ ఒత్తిళ్లే కారణమా?

సైబరాబాద్ – విశాల భారతి
చందానగర్‌కు చెందిన వితంతువుపై మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడి, బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేసిన గంగారం కాంగ్రెస్ నేత కంది జ్ఞానేశ్వర్‌ను అరెస్టు చేసిన చందానగర్ పోలీసుల తీరు వివాదాస్పదమైంది. నిందితుడిని మూడు రోజుల క్రితమే కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినా ఆ వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.2019లో భర్తను కోల్పోయిన బాధితురాలికి అండగా ఉంటానని నమ్మించి దగ్గరైన కాంగ్రెస్ నేత జ్ఞానేశ్వర్ (47), 2024లో శీతలపానీయంలో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించి పలుమార్లు లైంగికంగా వేధించడంతో పాటు విడతలవారీగా రూ.50 లక్షలకు పైగా వసూలు చేశాడు. ఎట్టకేలకు ధైర్యం చేసి బాధితురాలు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించి చర్లపల్లి జైలుకు పంపింది. అయితే నిందితుడు అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక నేత కావడంతో అరెస్టు, రిమాండ్ విషయాన్ని మూడు రోజుల పాటు పోలీసులు గుట్టుగా ఉంచారు.
సాధారణ కేసుల్లో అరెస్టు చేసిన వెంటనే మీడియాకు సమాచారం ఇచ్చి ఫొటోలు, వివరాలు వెల్లడించే పోలీసులు ఈ సున్నితమైన కేసులో మాత్రం మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లతోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కేసు వివరాలు బయటకు రాకుండా అడ్డుకున్నారని ప్రతిపక్ష నేతలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల విషయంలో పోలీసుల అత్యుత్సాహం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. నేరం చేసిన వారు ఎంతటివారైనా చట్టం ముందు సమానమేనని, పోలీసులు పక్షపాతం లేకుండా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.