పసికందు కోసం రూ.1.5 లక్షల డీల్
– పోలీసుల దెబ్బతో బెడిసికొట్టిన ప్లాన్
– చందానగర్ పోలీసుల చాకచక్యంతో కోల్‌కతాకు తరలించేలోపే ముఠా అరెస్ట్
సైబరాబాద్ – విశాల భారతి
లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై నిద్రిస్తున్న సర్కస్ కార్మికురాలి ఒడి నుంచి నెల వయసు పాపను ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా ఆటలు మూడు రోజుల్లోనే సాగనివ్వలేదు చందానగర్ పోలీసులు. పిల్లలు లేని కోల్‌కతా మహిళకు రూ.1.5 లక్షలకు విక్రయించి, ఫ్లైట్‌లో కోల్‌కతాకు తరలించేందుకు సిద్ధమైన నిందితులను అదుపులోకి తీసుకుని పాపను క్షేమంగా తల్లికి అప్పగించారు.జూన్ 30 తెల్లవారుజాము 2 గంటలు. బీదర్ జిల్లా బాల్కి గ్రామానికి చెందిన శాంతాబాయి కుటుంబ సభ్యులతో కలిసి లింగంపల్లి స్టేషన్ గోడ పక్కన నిద్రిస్తోంది. నెల వయసున్న ఆమె పాప ఒడిలో కదులుతోంది. అంతలో ఆటోలో వచ్చిన ఇద్దరు ఆగంతకులు మెరుపు వేగంతో పాపను లాక్కుని పరారయ్యారు. ఏడుపుతో మేల్కొన్న తల్లి వెంబడించినా ప్రయోజనం లేకపోయింది.తెల్లవారుజాము 4 గంటలకు చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది.ఆర్సీ పురం ఏసీపీ సీహెచ్.వై. శ్రీనివాస్ వెంటనే రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్ విజయ్, ఎస్సైలు సత్యనారాయణ, డీఐ అమీన్‌పూర్, ఎన్. భాస్కర్‌తో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్‌లోని వందలాది సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు. నిందితులు వికారాబాద్ వైపు వెళ్లినట్లు ఆధారాలు లభించాయి.అసలు కుట్ర కోల్‌కతాలో మొదలైంది. టాప్సియాకు చెందిన రహనుమా అలీకి 2021లో పెళ్లయ్యింది. సంతానం లేకపోవడంతో డబ్బు ఇచ్చి అయినా బిడ్డను తెచ్చివ్వాలని హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉండే పిన్ని నిమ్మి జహానీ @ సీమాను అడిగింది. సీమ తన స్నేహితురాలు నేరేడ్‌మెట్‌కు చెందిన నాజియాకు చెప్పింది. నాజియా తనకు కాబోయే భర్త వికారాబాద్‌కు చెందిన మహ్మద్ జుబేర్‌కు ‘పాపను తెస్తే లక్షలు వస్తాయి’ అని ఎర వేసింది. జుబేర్ వెంటనే దొంగతనం కేసులో గతంలో జైలుకు వెళ్లిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఇర్ఫాన్‌ను కలుపుకున్నాడు.జూన్ 30న తెల్లవారుజామున ఇద్దరూ స్నేహితుడు ఆరిఫ్ ఆటోను తీసుకుని లింగంపల్లి చేరుకున్నారు. ప్లాట్‌ఫాంపై నిద్రిస్తున్న శాంతాబాయి ఒడిలోని పాపను ఎత్తుకెళ్లి నేరేడ్‌మెట్‌లోని నాజియా ఇంట్లో దాచారు. వెంటనే సీమ, రహనుమా అలీకి ఫోన్ చేశారు. జులై 1న రహనుమా తన పిన్ని సర్వరీతో కలిసి ఫ్లైట్‌లో హైదరాబాద్ వచ్చింది. డీల్ ప్రకారం జుబేర్‌కు ఆన్‌లైన్‌లో రూ.1.5 లక్షలు పంపింది. పాపను కోల్‌కతాకు తీసుకెళ్లేందుకు నిందితులు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసుల ప్రత్యేక బృందాలు దాడి చేశాయి. ఈ కేసులో వికారాబాద్‌కు చెందిన మహ్మద్ జుబేర్, మహ్మద్ ఇర్ఫాన్, నేరేడ్‌మెట్‌కు చెందిన నాజియా, బంజారాహిల్స్‌కు చెందిన నిమ్మి జహానీ @ సీమ, కోల్‌కతాకు చెందిన రహనుమా అలీని అరెస్ట్ చేశారు. పాపను తల్లి శాంతాబాయికి అప్పగించారు.మూడు రోజుల్లోనే అంతర్రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకుని పాప ప్రాణాలు కాపాడిన చందానగర్ పోలీసులను సైబరాబాద్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
