A place where you need to follow for what happening in world cup

- Advertisement -

సాదాబైనామాలకు మోక్షమెప్పుడో?

0 147

– తెలంగాణ రైతాంగ అతిపెద్ద భూ సమస్య సాదాబైనామా
– ఈ సమస్య పరిష్కారం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు
– దీని అమలు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది
– అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చర్చోపచర్చలు
– సమస్య పరిష్కారానికి 2020లో దరఖాస్తు చేసుకొని ఉండాలి
– ప్రభుత్వాలు మారిన సాదాబైనామాల క్రమబద్ధీకరణలో జాప్యం
– రాష్ట్రప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణ
– ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది

విశాలభారతి, స్టేట్ బ్యూరో: సాదాబైనామా.. తెలంగాణ రైతాంగం పరిష్కారం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భూ సమస్య. దాదాపు 9.84 లక్షల దర ఖాస్తులకు సంబంధించిన 11 లక్షలకు పైగా ఎకరాలకు యాజమాన్య హక్కులు ఇచ్చే ప్రక్రియ. దీని అమలు కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోయినా, ఈ క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న, వ్యవహరించాల్సిన తీరుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చట్టం, నిబంధనల పేరుతో రైతులపై కఠినంగా కాకుండా అందరి ఆమోదం మేరకు ఉదారంగా వెళ్లడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. గతంలో ఉన్న ధరణి చట్టం స్థానంలో భూభారతి చట్టం తెచ్చినప్పుడు సాదా బైనామాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త అంశాలను చేర్చింది. సమస్య పరిష్కారానికి 2020లో ప్రభుత్వానికి దర ఖాస్తు చేసుకుని ఉండాలని, 12 ఏళ్లుగా భూమి అనుభవంలో ఉండాలని, సమస్య పరిష్కారమయ్యేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కట్టాలని స్పష్టం చేసింది.

అయితే ఆ తర్వాత చట్టానికి నిబంధనలు తయారు చేసేటప్పుడు అదనంగా మరికొన్ని నిబంధనలు పెట్టారు. సాదా బైనామా పరిష్కరించి 13 బీ సర్టిఫికెట్‌ ఇచ్చేటప్పుడు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎంత ఉంటే అంత ప్రభుత్వానికి చెల్లించాలని, సాదా బైనామాపై విచారణ సందర్భంగా కొన్న వ్యక్తితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్‌ ఇవ్వాలనే నిబంధనలు విధించారు. రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాలను పరిష్కరించే క్రమంలో చట్టంలోని నిబంధనల మేరకు వెళ్తే సన్న, చిన్నకారు రైతాంగానికి చాలా ఇబ్బందులు వస్తాయని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. గత ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుని పరిష్కరించకుండా వెళ్లిపోతే, ఈ ప్రభుత్వం సదరు దరఖాస్తులను పరిష్కరించకపోగా, రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని, కోర్టుల పాలు చేసిందనే అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి 2007 కంటే ముందు సాదా బైనామాలను పరిష్కరించే సమయంలో అమ్మిన వ్యక్తి సమ్మతి తప్పనిసరి అనే నిబంధన ఉండేది.

కానీ దివంగత వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆ నిబంధనను తీసేశారు. ఎప్పుడో అమ్మిన వ్యక్తి ఇప్పుడు అంగీకరించేందుకు ఇష్టపడక పోవచ్చు కాబట్టి చుట్టుపక్కల రైతులను విచారణ చేసి, లేదంటే గ్రామ పెద్దల స్టేట్‌మెంట్‌ ఆధారంగా కూడా క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికి తోడు పహాణీలోని సాగుదారు కాలమ్‌లో ఉన్న కొన్న వ్యక్తి పేరును ఆధారంగా పరిగణనలోకి తీసుకునేవారు. 2009–16 వరకు ఇదే పద్ధతిలో సాదా బైనామాలు క్లియర్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్న వారితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్‌ ఇవ్వాలంటే సమస్యను సృష్టించడమేనంటూ, ఆ నిబంధనను తొలగించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే రైతుల నుంచి రాతపూర్వక అభ్యంతరాలు తీసుకోవడంతో పాటు చుట్టు పక్కల రైతులను విచారించాలనేది నిబంధనగా చేర్చాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.

సాదా బైనామాల పరిష్కారానికి 2020 అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 9.84 లక్షల దరఖాస్తులు రాగా కొన్నింటిని అప్పట్లోనే పరిష్కరించినట్టు తెలుస్తోంది. అప్పట్లో వచ్చిన ధరణి చట్టంలో సాదా బైనామాల పరిష్కార అంశం లేనప్పటికీ ఆన్‌లైన్‌లో వచ్చిన దాదాపు 4 లక్షల దరఖాస్తులపై అప్పుడే నిర్ణయం తీసుకున్నారని, అందులో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించారని తెలుస్తోంది. అయితే కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనామాల పరిష్కారం కోసం 2020లో దరఖాస్తు చేసి ఉండాలని మాత్రమే ఉంది కానీ, అప్పట్లో తిరస్కారానికి గురైతే మళ్లీ పరిశీలించకూడదని లేదు. ఈ చట్టం నిబంధనల్లోనూ దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం గురించిన ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయం మధ్యలో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పరిష్కరించాల్సిందేనని నిపుణులు చెపుతున్నారు.

అన్నింటి కంటే ముఖ్యంగా చట్టం, నిబంధనలపైనే ఆధారపడకుంగా సమ్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. సాదా బైనామాలను ఉదారంగా పరిష్కరించకపోతే మరోమారు పరిష్కారానికి అవకాశం లేదు కాబట్టి రైతులు నష్టపోతారని, మళ్లీ సివిల్‌ కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. చెక్‌లిస్టు, ఎంక్వైరీ ఫార్మాట్, ప్రాసెస్‌ విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని అంటున్నారు. సాదా బైనామా అనేది తెలంగాణలో పెద్ద భూసమస్య. 1989 నుంచి నలుగుతున్న సమస్య. అది కూడా చిన్న, సన్నకారు రైతులకు సంబంధించింది. కొన్న మాట వాస్తవమా?.. కాదా?, సాగులో ఉన్నారా?.. లేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలింకుని మిగిలిన అంశాల్లో పట్టుదలకు పోకుండా ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరించాలి. అదే సమయంలో అవకతవకలు జరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి.

తెలంగాణ రైతాంగానికి సుపరిచితమైన ఈ సాదా బైనామాల వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజాం రాజ్యం నుంచి నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్ర రైతాంగం కేవలం తెల్ల కాగితాలపై రాసుకోవడంతో పాటు నోటి మాటలతో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జరిపింది. వీటినే సాదా బైనామాలంటున్నారు. నిరక్షరాస్యతతో పాటు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ కావాలంటే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి వస్తుందనే కారణంతో కొందరు రైతులు ఈ ప్రక్రియ ద్వారా భూముల యాజమాన్య హక్కును మార్చుకునే వారు. కానీ కొన్ని వ్యక్తికి అధికారికంగా ఎలాంటి హక్కులు వచ్చేవి కావు. తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌)లో తొలిసారిగా 1989లో సాదా బైనామాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత 1996, 97.. ఇలా ఇప్పటికి 13 సార్లు ఉచితంగా ఈ తరహా భూములను క్రమబద్ధీకరించారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016, 2017లో కూడా క్రమబద్ధీకరణ జరిగింది. చివరిసారిగా 2020లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు. ఇప్పుడు ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియనే జరుగుతోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు.

సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ గందరగోళంగా మారింది. భూముల క్రమబద్ధీకరణపై రెవెన్యూశాఖ అలసత్వంతో కార్యాలయాల చుట్టూ తిరిగి రైతులు అలసిపోతున్నారు. వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల్సిన తహసీల్దార్లు తగిన చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. సరైన కారణం లేకుండా దరఖాస్తులను తిరస్కరించడం ఓ తంతుగా మారిపోయింది. పరిష్కార మార్గాలు చూపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గడువులు పొడిగిస్తూ కాలం వెళ్లదీస్తోంది. రాష్ట్రంలో లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేవు. రిజిస్టర్‌ కాని దస్తావేజుల ద్వారా భూములు కొనడం వల్ల పట్టాదారు పాసుపుస్తకాలు పొందలేకపోతున్నారు. 2014 వరకు భూములు కొన్నవారే సాదాబైనామాల క్రమబద్ధీకరణకు గతంలో అర్హులుగా ఉండగా 2021 వరకు కొనుగోలు చేసిన వారికీ ప్రభుత్వం అవకాశం కల్పించింది.

అయితే గడువులు పెంచుకుంటూ పోవడం తప్ప సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఎప్పటికి పూర్తవుతుందో అంతుచిక్కడం లేదు. 1989 జూన్‌ నుంచి 2023 నవంబర్ మధ్య ఇలాంటి భూముల క్రమబద్ధీకరణపై 16 జీఓలు వెలువడ్డాయి. 71 వేల 384 ఎకరాల క్రమబద్ధీకరణకు 3లక్షల మంది దరఖాస్తు చేసినట్లు నాలుగేళ్ల కిందట ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ, గడువు ముగింపు తేదీలు మారాయే కానీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మీసేవ కేంద్రాలు లేదా గ్రామ-వార్డు సచివాలయాల ద్వారా రైతులు దరఖాస్తు చేశాక క్రయ, విక్రయదారులను పిలిపించి తహసీల్దార్లు విచారణ చేయాలి. ఎసైన్డ్‌ భూముల బదలాయింపు నిషిద్ధ చట్టం, 1973-బీ పట్టణ భూపరిమితి చట్టం, 1976, ఇతర చట్టాల ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరగలేదని నిర్ధారించుకున్నాక భూమి కొనుగోలును క్రమబద్ధీకరించి 13-బీ సర్టిఫికెట్‌ జారీ చేయాలి. అప్పుడు సాదా బైనామాలకు రిజిస్టర్డ్‌ దస్తావేజుకు ఉన్న విలువ వస్తుంది. భూమి యాజమాన్యపు హక్కు పత్రం, పట్టాదారు పాసు పుస్తకం లభిస్తాయి. అయితే ఈ భూముల వ్యవహారాలు కొన్నిసార్లు విజిలెన్స్, ఏసీబీ కేసుల్లో చిక్కుకుంటూ ఉండటం వల్ల క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవడానికి కొందరు తహసీల్దార్లు సాహసించడం లేదు. సాదా బైనామా క్రమబద్ధీకరణను అడ్డుపెట్టుకుని గ్రామ సచివాలయాలు, మండల రెవెన్యూ సిబ్బంది మాత్రం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నాయుడుపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి తండ్రి నుంచి 80 సెంట్ల భూమి పొందారు. ఆ వివరాలను రికార్డుల్లోకి ఎక్కించేందుకు సిబ్బంది బేరాలు పెట్టారు. చిల్లకూరు మండలంలో ఓ రైతుకు సంబంధించి 2.80 సెంట్ల భూమి క్రమబద్ధీకరణ విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. వీలైనంత త్వరగా సాదా బైనామా సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవటంతో భూ యజమానిగా లబ్ధి పొందలేకపోతున్నామని, రుణాలు కూడా రావడంలేదని వాపోతున్నారు. కొనుగోలు సమయంలో రాసుకున్న కాగితాలు హక్కుల నిరూపణకు ఆధారాలుగా కోర్టుల్లో చెల్లుబాటుకాని విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి, ఆ భూములకు హక్కులను కల్పిస్తూ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయాల్సిన ప్రభుత్వం కోర్టులో కేసు కారణంగా పెండింగులో పెట్టింది. కోర్టులో దాఖలైన పిటిషన్‌కు గత ప్రభుత్వం కౌంటర్‌ పిటిషన్‌ వేయని కారణంగానే జాప్యం దరఖాస్తులు పరిశీలనకు నోచుకోలేదు. దరఖాస్తులన్నీ తహసీల్దార్‌ కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ఆ దరఖాస్తులను పరిశీలించని కారణంగా రైతులు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం ద్వారా వచ్చే సాయం, ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా అందే సాయాన్ని కోల్పోవుచున్నారు. అలాగే రైతుబీమాకు నోచుకోవడం లేదు. బ్యాంకుల ద్వారా వడ్డీ లేని పంట రుణాలను, ఇతరత్రా రుణాలను పొందలేకపోతున్నారు. సాదాబైనామా దరఖాస్తులను ఎప్పుడు పరిశీలిస్తారా అని ఎదురుచూస్తున్న రైతులు రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు. గత ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించకపోవడంతో భూములను విక్రయించిన పట్టాదారులు గానీ, వారి వారసులు వివాదాలు సృష్టిస్తున్నారని రైతులు అంటున్నారు. ఈ భూములు తమవేనని, తాము విక్రయించలేదంటూ తిరగబడుతున్నారని చెబుతున్నారు. సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించడంలో మరింత జాప్యం జరిగితే మాత్రం రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు దక్కకపోగా, భూములపై వివాదాలు పెరిగే ప్రమాదం ఉంది.

తెలిసో తెలియకో తెల్లకాగితంపై ఒప్పందం చేసుకొని (సాదాబైనామా) భూములు కొనుగోలు చేసినవారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విషయంలో రాష్ట్రప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నేట్టే కనిపించినా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. సాదాబైనామా సమస్యకు సంబంధించిన సమస్య దశాబ్దాల తరబడి మగ్గుతోంది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు వెల్లువలా వచ్చిన దరఖాస్తులే ఇందుకు ఉదాహరణ. తెలంగాణకే పరిమితమైన ఈ సాదాబైనామా సమస్యను సమైక్యాంధ్రలో అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆనాడు కోనేరు రంగారావు కమిటీ (కేఆర్‌ఆర్‌) చేసిన సిఫార్సులను కూడా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతుండడం పట్ల సాదాబైనామా రైతులు ఆందోళన చెందుతున్నారు.

నాలుగేళ్ల కిందట ప్రభుత్వం తొలిసారిగా సాదాబైనామాల క్రమబద్ధీకరణలో ఐదెకరాలలోపు వ్యవసాయ భూములకు ఉచితంగా తహసీల్దార్‌ కార్యాలయంలో పట్టా మార్పిడీ ప్రక్రియ చేపట్టింది. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుములు అప్పట్లో తీసుకోలేదు. ఐదెకరాల కంటే అధిక విస్తీర్ణం ఉన్న భూములకు నిబంధనల మేరకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుము వసూలు చేశారు. అప్పుడు కొంత మేరకు సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ జరిగింది. అయితే చాలా మంది రైతులు అవగాహన లేక, ఇతరత్రా కారణాల వల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోలేక పోయారు. దరఖాస్తులను సరైన విధంగా సమర్పించకపోవడం వల్ల సాంకేతిక కారణాలతో కొన్ని తిరస్కారానికి గురయ్యాయి. ఏడాది కిందట మరోమారు తెల్లకాగితంపై రాసుకున్న భూక్రయ విక్రయాలకు చట్ట బద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు ఆహ్వానించింది అయితే దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియ అనూహ్యంగా నిలిచిపోవడంతో దరఖాస్తుదారులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని, అందువల్లే దరఖాస్తులకు మోక్షం లభించడంలేదని అధికారులు పేర్కొంటున్నారు.ప్రభుత్వం నుంచి సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. ప్రస్తుతం భూలావాదేవీలు పూర్తిగా ధరణి పోర్టల్‌ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనే ఉంది. పోర్టల్‌లో ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తే దరఖాస్తులను పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వపరంగా దీనిపై నిర్ణయం తీసుకుంటే తహసీల్దార్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపడతారు.

తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. భూ భారతి చట్టం సెక్షన్‌-6లోని సబ్‌ సెక్షన్‌ 1 కింద సాదాబైనామా పత్రాలను క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపింది. 2020 అక్టోబరు 12 నుంచి అదే ఏడాది నవంబరు 10 వరకు స్వీకరించిన దాదాపు 9 లక్షలకు పైగా దరఖాస్తులను క్రమబద్ధీకరణకు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన, క్రమబద్ధీకరణ అధికారం భూ భారతి చట్టం ప్రకారం రెవెన్యూ డివిజనల్‌ అధికారికి కట్టబెట్టారు. దీంతో ఆయన పరిధిలోని ఎమ్మార్వోలను ఉపయోగించుకుని క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి ప్రభుత్వ, నిషేధిత జాబితాలో లేని భూములుగా నిర్ధారించుకున్న తర్వాతే క్రమబద్ధీకరణ చేస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

భూ భారతి చట్టం ద్వారా అర్హమైన సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరిస్తామని గతంలో ఓ పిల్‌ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇవ్వడంతో దర్యాప్తును మూసి వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. రాష్ట్రంలోని పట్టణాలు మినహా ఇతర ప్రాంతాల్లో 2014 జూన్ రెండో తేదీ ముందు వరకు ఉన్న సాదాబైనామా కొనుగోళ్లకు 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టింది. అప్పట్లో 12.64 లక్షల దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం 6.18 లక్షలు మాత్రమే క్రమబద్ధీకరించారు. రెండోసారి 2020లో క్రమబద్ధీకరణకు అవకాశమిస్తూ ప్రభుత్వం దరఖాస్తులను మరోసారి ఆహ్వానించింది. కానీ ఆర్వోఆర్-1971ను సవరించి తెచ్చిన ఆర్వోఆర్-2020 చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు కానీ, నియమ నిబంధనలు చేర్చలేదు. పైగా ఆ చట్టం అమలులోకి రావడానికి ముందు, వచ్చిన తర్వాత దరఖాస్తులను స్వీకరించడం న్యాయ వివాదానికి దారి తీసింది.

1971 నాటి చట్టం అమల్లో ఉన్నప్పుడు తీసుకున్న దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్నప్పటికీ ఈ ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. అప్పుడు వచ్చిన 9 లక్షల 894 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిష్కారానికి తాజాగా రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న లక్షలాది సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణ దిశగా మోక్షం కలిగినట్లయింది.

సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పలుమార్లు హామీ ఇచ్చారు. న్యాయస్థానంలో ఉన్న వివాద పరిష్కారానికి పలు చర్యలు చేపట్టడంతో హైకోర్టు సాదా బైనామాల రైతులకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి రాష్ట్ర హైకోర్టు అనుమతించింది. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో నాలుగు లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్‌ కూడా ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో సమయాన్ని స్పష్టంగా నిర్దేశించడంతో కొత్తగా వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను తీసుకునే అవకాశం లేదని చెప్పాలి.

2014 నాటికి సాదా బైనామా ద్వారానో మ‌రో ర‌కంగానో, యాజ‌మ‌న్యా హ‌క్కులు ఉండి కాస్తు చేసుకుంటూ ఉండి ప‌ట్టా కాలంకు ఎక్క‌ని వారు ఎంతో మంది ఉన్నారు. 2024 ధ‌ర‌ణి ప్ర‌కారం పోల్చుకుని చూస్తే ఆ లెక్క‌లు బ‌య‌ట‌ప‌డుతాయి. కాస్తు కాలం తొల‌గించ‌డంతో చాలా మంది త‌మ యాజ‌మాన్య హ‌క్కులు కోల్పోయారు. కొన్ని ల‌క్ష‌ల మంది న‌ష్ట‌పోయి ఉంటార‌ని చెబుతున్నారు. ధ‌ర‌ణి వ‌చ్చిన త‌ర్వాత ప‌ట్టా కాలంలోకి ఉన్న‌వారికి బెనిఫిట్ జ‌రిగింది. కాస్తు కాలంలో ఉన్నవారికి తీవ్ర న‌ష్టం జ‌రిగింది. ఇలా ఎంత జ‌రిగిందంటే ఒక ఆడిట్ జ‌రిగితే త‌ప్ప బ‌య‌ట ప‌డ‌దు.

రైతాంగం భూ హక్కుల కోసం కార్యాలయాల చుట్టు తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావటం లేదు. 2020లో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు భూ హక్కులను కల్పించే పట్టాదారు పాసు పుస్తకాల చట్టం- 1971ని రద్దు చేసి కొత్తగా పాసుపుస్తకాల చట్టం-2020 ధరణిని తీసుకవచ్చింది. అయితే కొత్త చట్టం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించేందుకు గత ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించిన దాఖాలాలు లేవు. దీంతో సాదాబైనామాలతో పాటు అసైన్డ్‌ భూముల సమస్యల పరిష్కారానికి ధరణిలో ఏలాంటి మార్గాలను చూపించలేదు. దీంతో పాటు గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేయటంతో రైతుల కష్టాలు మరింతా పెరిగాయి.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, సాదాబైనామాలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే కోర్టు స్టే కారణంగా ఆ హామీని నెరవేర్చడంలో కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు కోర్టు తీర్పుతో ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ లభించిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల సాదాబైనామాలను త్వరలోనే పరిష్కరిస్తామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. భూమి రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారం కోసం ఈ చర్యలు ఎంతో తోడ్పడనున్నాయి. భూమికి సంబంధించి సరైన పత్రాలు లేని వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది. ఇక నుంచి భూమికి సంబంధించి అన్ని హక్కులను రిజిస్ట్రేషన్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.

రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒక్కటి సాదాబైనామా. గతంలో చాలమంది రైతులు తెల్లకాగితాలపై, రెవెన్యూ స్టాంపు పేపర్లుపై భూములు క్రయవిక్రయాలు చేశారు. ఇవీ అధికారికం కాకపోవటంతో వీటికి రిజిస్ర్టేషన్లు జరగలేదు. ఫలితంగా బ్యాంకుల్లో వీరికి రుణాలు కూడా అందటం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల సమస్యల పరిష్కారంపై ఫోకస్‌ చేసింది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో రెవెన్యూ గ్రామ సదస్సులను ప్రభుత్వం నిర్వహించింది. ఈ సదస్సుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే దరఖాస్తులు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు మరోసారి భూభారతి సదస్సులో దరఖాస్తులు చేశారు. దీంతో ప్రభుత్వం హైకోర్టును అశ్రయించి, సాదాబైనామాలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. దీంతో గత ప్రభుత్వం తీసుకవచ్చిన 112జీవో స్థానంలో కొత్తగా భూ భారతి చట్టం తీసుకవచ్చిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు కోర్టు విచారణ అనంతరం సాదాబైనామాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.