Local Body Elections: లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్!
telangana-gram-panchayat-election-schedule-set-for-release
Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలుకానుండటంతో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు సాయంత్రం అధికారికంగా షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. సుమారు 31 జిల్లాల పరిధిలోని 545 గ్రామీణ మండలాలు, మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు, 1,13,534 వార్డులకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ను కమిషన్ ప్రకటించనుంది. మూడు విడతల్లో ఓటింగ్ నిర్వహించాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించగా, పంచాయతీరాజ్ శాఖ మరియు ఎన్నికల సంఘం దీనికి అవసరమైన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నాయి.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని ఈరోజు సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికల షెడ్యూల్‌ను, నామినేషన్ దశలను, పోలింగ్ తేదీలను మరియు ఇతర ముఖ్యాంశాలను అధికారికంగా తెలియజేయనున్నారు. ఈ ప్రకటనతో గ్రామస్థాయి రాజకీయ కార్యకలాపాలు మరింత ఉత్సాహంగా మారే అవకాశం ఉంది. స్థానిక నాయకులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు ఈ షెడ్యూల్ కీలకంగా మారనుంది.
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో కూడా కీలక విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సీజే ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. సాధారణంగా సోమవారం విచారణ జరగాల్సి ఉండగా, కారణాలవల్ల ఇది మంగళవారానికి వాయిదా పడింది. పాత రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే అడ్వొకేట్ జనరల్‌కు నివేదిక అందించింది.
ఇదే సమయంలో, ప్రభుత్వం మంగళవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో పంచాయతీ ఎన్నికల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. ఎన్నికల సంఘం సమర్పించిన మూడు దశల పోలింగ్ ప్రతిపాదనలు ఇప్పటికే పరిశీలనకు వచ్చిన నేపథ్యంలో, ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల కార్యక్రమాల అమలు కోసం అవసరమైన సిబ్బంది నియామకం, భద్రతా చర్యలు, ఓటర్ల జాబితాల పరిశీలన వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశాలున్నాయి.
