బహదూర్‌గూడలో ఉద్రిక్తత
– భూములివ్వమని రైతుల నిరాకరణ
– బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణకు ప్రతిఘటన
– 5 రోజులుగా ఆందోళన.. రైతులకు బీఆర్ఎస్ మద్దతు
సైబరాబాద్ – విశాల భారతి
శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చేపడుతున్న భూసేకరణ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రాజెక్టులో భాగంగా భూములు ఇచ్చేందుకు స్థానిక రైతులు నిరాకరిస్తుండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూముల సేకరణ కోసం హైడ్రా అధికారులు శనివారం బహదూర్‌గూడ వద్దకు భారీగా చేరుకున్నారు. అయితే గత ఐదు రోజులుగా రైతులు ఆందోళన చేస్తూ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. తమకు ప్రత్యామ్నాయ భూమి, తగిన పరిహారం, పునరావాస హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. రైతులను బలవంతంగా ఖాళీ చేయించవద్దని, ముందుగా అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఘటనా స్థలంలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. అధికారులు రైతులతో చర్చలు జరుపుతున్నారు.
