జర్నలిస్టులకు చంద్రశేఖర్ ప్రసాద్ ‘భరోసా’
– శేరిలింగంపల్లి వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్
– ప్రీమియం మొత్తం నేనే భరిస్తా
– టీఆర్ఎస్ శేరిలింగంపల్లి అధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
శేరిలింగంపల్లి – విశాల భారతి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం టీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి అధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ భారీ ప్రకటన చేశారు. నియోజకవర్గ పరిధిలోని అందరు జర్నలిస్టులకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తానని, దానికి అవసరమైన పూర్తి బీమా ప్రీమియంను తానే భరిస్తానని ఆయన ప్రకటించారు.ఇటీవల టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విడుదల చేసిన నియోజకవర్గ ఇన్‌చార్జిల తొలి జాబితాలో చోటు దక్కించుకున్న చంద్రశేఖర్ ప్రసాద్.. శుక్రవారం మియాపూర్‌లోని శుభం కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
సమస్యలపై సానుకూల స్పందన..
కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడు ధూపం ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాసేవలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న జర్నలిస్టులకు సరైన ఆరోగ్య రక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు.
దీనికి స్పందించిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్.. శేరిలింగంపల్లి పరిధిలోని వర్కింగ్ జర్నలిస్టులందరి ఇన్సూరెన్స్ బాధ్యతను తానే తీసుకుంటున్నట్లు సభాముఖంగా ప్రకటించారు.
కుటుంబాలకు పెద్ద ఊరట..
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండి సలీం పాషా మాట్లాడుతూ “గతంలో ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు నిమ్స్‌కే పరిమితమయ్యాయి. అత్యవసర సమయంలో కార్పొరేట్ వైద్యం కోసం జర్నలిస్టులు లక్షల్లో అప్పులు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో చంద్రశేఖర్ ప్రసాద్ ముందుకు రావడం అభినందనీయం. ఈ పథకం జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సీనియర్ జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, టీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం ఉదారంగా స్పందించిన చంద్రశేఖర్ ప్రసాద్‌కు జిల్లా జర్నలిస్టుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
