A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఒంటరవుతున్న ‘కొండా’ దంపతులు

0 695

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్వంతపార్టీ కాంగ్రెస్‌లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకు ఉన్న సమీకరణలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. దీంతో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఒంటరైన మంత్రి కొండా సురేఖ దంపతులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సైతం ఒంటరిగా మారుతున్నారనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైన ఈ మార్పు ప్రభావం వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. తూర్పులో పార్టీ లేదా ప్రభుత్వ కార్యక్రమాలుగానీ తాము చెప్పినట్లే సాగాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం తాము గీసిన గీత దాటాద్దొంటూ ‘పట్టు’ బిగించేందుకు ప్రయత్నించిన కొండా దంపతులకు తమ అనుచరుల నుంచే వ్యతిరేకత ప్రారంభమైందన్న చర్చలు నడుస్తున్నాయి. ఈ వ్యతిరేకత నుంచే పార్టీలో సమీకరణలు మారుతున్నాయని జిల్లా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొన్నటి వరకు కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సురేఖ వ్యతిరేక వర్గానికి చెందిన ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు నిర్వహించారు. కొండా దంపతులకు, స్వర్ణకు మధ్య ఉప్పూనిప్పుగానే సాగింది. ఇటీవల నూతన డీసీసీ అధ్యక్షుల నియాకమంతో వరంగల్ తూర్పునకు చెందిన మైనార్టీ నాయకుడు అయూబ్ కు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ పార్టీ అందరినీ ఆశ్చర్చపరిచింది. అయూబ్‌కు వర్గ ముద్రలు లేకపోవడంతో కొండా దంపతులు నూతన అధ్యక్షుడితో సఖ్యతతో వ్యవహరిస్తారని అంతా భావించారు. అయూబ్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి సోనియా జన్మదినోత్సవం పార్టీ అంతాకలిపి జరిపితే కొండా వర్గం నాయకులు దీనికి దూరంగా ఉన్నారు. ఆ వర్గం వేరే కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పులో తమ విజయానికి కారణమైన మైనార్టీలకు ప్రతినిధిగా ఉన్న ఆయూబ్‌ను సైతం కొండా వర్గం పట్టించుకోకుండా అవమానించిందనే కొత్త చర్చకు దారితీసింది.

కొండా దంపతుల తీరుకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు వారికి మద్ధతు తెలియజేసిన పార్టీ నాయకులతో పాటు, కొండా వ్యతిరేక వర్గం నాయకులు, అయూబ్ అనుకూలురంతా కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి, కలిసి కట్టుగా సాగాలని నిర్ణయించడం ఇప్పుడు తూర్పులో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఒక్క సారిగా తూర్పు కాంగ్రెస్ రాజకీయాల్లో వేడిపెరిగింది. కొండ దంపతుల అనుచరుడిగా గుర్తింపు పొందిన నల్లగొండ రమేష్ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సమావేశమై మంతనాలు జరపడం ఇప్పుడు అనూహ్యపరిణామంగా చెప్పవచ్చు. ఈ సమావేశానికి కొండా వ్యతిరేక వర్గ నాయకుడు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య హాజరుకావడం సీరియస్ పరిణామంగా భావిస్తున్నారు. కొండా దంపతులు ఒకవైపు తూర్పు ముఖ్య నేతలు మరోవైపు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కొండా వర్గం తమకు కనీస న్యాయం చేయడంలేదనే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ పదవులతోపాటు, ఇప్పటి వరకు తూర్పునకు నామినేటెడ్ పదవులు రాని అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. వరంగల్ తూర్పు కాంగ్రెస్ నాయకులంతా నూతన అధ్యక్షుడు అయూబ్, మాజీ మంత్రి సారయ్య నాయకత్వంలో పీసీసీ పెద్దలను, సీఎం రేవంత్ ను కలిసి పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల గురించి విన్నవించాలని నిర్ణయించినట్లు సమాచారం.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తూర్పు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ ప్రతినిధి అయూబ్‌ను నియమించడంతో జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా అయూబ్‌కు మంత్రి మద్ధతునందించకపోవడంతో జిల్లాలోని మిగిలిన వర్ధన్నపేట, నర్సంపేటతోపాటు, తూర్పులోని కొండా వ్యతిరేక వర్గమంతా కలిసి కట్టుగా సాగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో వరంగల్ జిల్లాలో కూడా అంతా ఒక వైపు, కొండా దంపతులు ఒక వైపు అన్నట్లుగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ను కోరారు. ఈ జిల్లాలో మంత్రి కొండా దంపతులకు, అక్కడి ఎమ్మెల్యేలకు మధ్య కొంతకాలంగా నలుగుతున్న విభేదాలు రచ్చకెక్కడంతో ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా ఛైర్మన్‌ వెంకట్రాంరెడ్డి తదితరులు ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మీనాక్షి కార్యాలయానికి వచ్చి కలిశారు. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏకపక్షంగా తలదూరుస్తూ, అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వారి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా రాతపూర్వకంగా తెలిపారు.

రాష్ట్రస్థాయి ముఖ్య నేతలపై కూడా లెక్కలేనట్లుగా వారు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నందున పార్టీకి తీరని నష్టం కలుగుతోందని జిల్లా నేతలు ఉదాహరణలతో సహా మీనాక్షికి చెప్పినట్లు సమాచారం. తనకు అన్ని విషయాలు తెలుసని, విచారణకు పార్టీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆమె వారికి తెలిపారు. పార్టీలో విభేదాలుంటే అంతర్గత వేదికలపై చెప్పాలని, మీడియా ముందు ఎవరూ మాట్లాడవద్దని ఆమె గట్టిగా హెచ్చరించినట్లు నేతలు తెలిపారు. ఆమె సూచనలతో ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. సమావేశం అనంతరం పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవిని తన కార్యాలయానికి పిలిపించి మీనాక్షి చర్చించారు. వరంగల్‌ నేతల మధ్య విభేదాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో నాయకుల మధ్య ఎక్కువగా విభేదాలున్నాయనే అంశంపైనా ఆమె వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిని ఉపేక్షించవద్దని, విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని మీనాక్షి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధిక స్థానాల్లో నెగ్గేందుకు నేతలంతా ఐక్యంగా పనిచేయాలని మీనాక్షి  సూచించారు. ఈ ఎన్నికలపై పంచాయతీరాజ్‌ సంఘటన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఛైర్మన్‌ రాచమల్ల సిద్ధేశ్వర్‌ అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో జరిగింది. ఇందులో మీనాక్షి, సంఘటన్‌ జాతీయ అధ్యక్షుడు సునీల్‌ పన్వర్‌ తదితరులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సంఘటన్‌ కీలకపాత్ర పోషించాలని ఆమె స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.