నార్సింగిలో స్నేహితుల మధ్య ఘర్షణ.. యువకుడు మృతి
– డెలివరీ విషయంలో గొడవ.. తలకు బలమైన గాయంతో కుప్పకూలిన యువకుడు
రాజేంద్రనగర్ – విశాల భారతి
స్నేహితుల మధ్య ఉద్యోగ సంబంధిత వివాదం విషాదంగా మారింది. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.కోకాపేటకు చెందిన అబ్దుల్ సమీద్ వయసు 31 సంవత్సరాలు. అతడు తన స్నేహితుడితో కలిసి నార్సింగిలోని ఓ ప్రముఖ బ్లింకిట్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. డెలివరీల విషయంలో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మాటపట్టింపులు ఉన్నట్లు సమాచారం. గురువారం రాత్రి పనిచేసే ప్రదేశంలోనే ఇరువురి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. కాసేపటికే వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో సమీద్ తలకు తీవ్రమైన గాయం అయ్యింది. పెద్ద ఎత్తున రక్తస్రావం కావడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సమీద్ మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘర్షణకు దారితీసిన కారణాలు, దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
