A place where you need to follow for what happening in world cup

- Advertisement -

మిషన్ సహాయకుడిది ప్రమాదమా మృతా? హత్యా?

0 356

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, విశాలభారతి : మణుగూరు మండలంలోని తిర్లాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఇసుక ర్యాంపుల్లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న మిషన్ డ్రైవర్ సహాయకుడి మృతి పలు అనుమానాలకు తావిస్తోందని రేణుక అక్షర మహిళ మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ ఆరోపించారు. శనివారం విలేకరులతో మాట్లాడారు. అతను స్నానానికి వెళ్లి ప్రమాదవ శాత్తు మృతి చెందాడా, లేక ఎవరైనా చంపారా అన్న అనుమానాలు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాలతో వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమ వ్యవహారాలే ఈ మరణానికి కారణమై ఉండ వచ్చాన్నారు. ర్యాంపుల పేరుతో అక్రమ రహదారులు నిర్మించి, గోదావరి, వాగులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. లారీల రాకపోకల కోసం నిబంధనలకు విరుద్ధంగా మట్టి, ఇసుకతో అడ్డగోలు నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. వే బిల్లులు లేకుండా హైదరాబాద్ తదితర పట్టణాలకు ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగుతోందని, ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కి కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారన్నారు. అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత కూడా లోడింగ్ పనులు చేయిస్తున్నారని నిద్రాహారాలు లేకుండా పని చేయించడం వల్లే ప్రమాదాలు, ఆకస్మిక మరణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల సహజ సంపదైన ఇసుకను బయటి వ్యక్తులు కొల్లగొడుతున్నారని స్థానిక యువతకు ఉపాధి కల్పించాల్సిన ర్యాంపులు శ్రమ దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చి మృతి చెందిన బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలంటే పారదర్శక విచారణ తప్పనిసరిగా జరగాలని డిమాండ్ చేశారు. అనుమానాస్పద మృతిగా కాకుండా అన్ని కోణాల్లో కేసు నమోదు చేయాలని కోరారు. ర్యాంపుల్లో పనిచేస్తున్న వారికి ప్రమాద బీమా, వైద్య సదుపాయాలు ఏవీ కల్పించడం లేదని బాధితులు చెబుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మరో ప్రాణం పోకముందే ప్రభుత్వం స్పందించాలన్నారు. అక్రమ ఇసుక రవాణాపై గతంలో ఇచ్చిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోలేదని కాంట్రాక్టర్లకు కొందరు అధికారుల అండదండలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ ఘటనపై రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖలతో సంయుక్త విచారణ జరిపించి, బాధితుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. కాంట్రాక్టర్‌ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి ర్యాంపు అనుమతులు రద్దు చేయాలని కోరారు. లేదంటే ప్రజా సంఘాల మద్దతును కూడగట్టుకుని పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు ఎండి షబానా, కోరి శ్యామల, కన్నాపురం వసంత ,డేరంగుల సుజాత, రెడ్డి బోయిన రేణుక, బాడిశ పార్వతి ,సౌజన్య డాకూరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.