హైదరాబాద్ రెడ్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
– కొత్తగూడ నివాసంలో తనిఖీలు
– ఆదాయానికి మించిన ఆస్తులపై విచారణ
సైబరాబాద్ – విశాల భారతి
హైదరాబాద్‌లోని రెడ్‌కో (REDCO) ప్రధాన కార్యాలయంలో డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణ నివాసంలో బుధవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది.కొత్తగూడలోని మీనాక్షి స్కైలాంజ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న వెంకటరమణ నివాసానికి ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం చేరుకుని తనిఖీలు ప్రారంభించింది. ఇంట్లోని ప్రతి గదిని క్షుణ్నంగా పరిశీలించిన అధికారులు ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, పెట్టుబడుల రికార్డులు, స్థిరాస్తుల డాక్యుమెంట్లు, ఇతర కీలక పత్రాలను పరిశీలించారు.అధికారికి చెందిన ఆస్తుల విలువ, అధికారిక ఆదాయ వనరులు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాల సందర్భంగా లభించిన పత్రాలు, రికార్డుల ఆధారంగా ఆస్తుల విలువను అంచనా వేసే ప్రక్రియ కొనసాగుతోంది.బుధవారం ఉదయం ప్రారంభమైన సోదాలు పలువురు ఏసీబీ అధికారుల సమక్షంలో కొనసాగాయి. సేకరించిన వివరాలను విశ్లేషించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అవసరమైతే సంబంధిత అధికారిని విచారణకు పిలిచే అవకాశమూ ఉన్నట్లు తెలిసింది.ఈ ఘటనతో రెడ్‌కో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే సోదాల్లో లభించిన నగదు, బంగారం లేదా ఇతర ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోదాలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
