కిరాతక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష
– మృతదేహాన్ని దహనం చేసి సాక్ష్యాల ఆనవాళ్ళ మాయానికి యత్నం
– తీర్పు వెలువరించిన మేడ్చల్ కోర్టు
సైబరాబాద్ – విశాల భారతి
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడికి మేడ్చల్ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. హత్య అనంతరం మృతదేహాన్ని తగులబెట్టి సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు యత్నించినట్లు అభియోగాలు రుజువు కావడంతో న్యాయమూర్తి జి. భానుమతి సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు.పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రం ధుమ్కా జిల్లాకు చెందిన భునేశ్వర్ సింగ్ 2022లో వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో జీడిమెట్లలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని అగ్నికి ఆహుతి చేసి, సాక్ష్యాలను పూర్తిగా చెరిపివేయాలని ప్రయత్నించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు అప్పటి ఇన్‌స్పెక్టర్ ఎం. పవన్ పర్యవేక్షణలో, ఎస్‌ఐలు కె. గౌతమ్, ఎ. హరీష్ సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలతో పాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరించి కోర్టులో పటిష్ఠమైన అభియోగపత్రాన్ని దాఖలు చేశారు.విచారణ సందర్భంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. విజయ్ రెడ్డి సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం..నిందితుడిపై మోపిన అభియోగాలు సందేహాతీతంగా రుజువైనట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన హత్య నేరానికి యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. అలాగే మృతదేహాన్ని దహనం చేసి సాక్ష్యాలు మాయం చేసేందుకు యత్నించిన నేరానికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదు వందల రూపాయల జరిమానా విధించింది. దీంతో పాటు సాక్ష్యాధారాల నాశనం యత్నానికి సంబంధించిన మరో అభియోగానికి మూడు నెలల కఠిన శిక్ష, ఐదు వందల జరిమానా ఖరారు చేసింది. శాస్త్రీయ ఆధారాలు, సమర్థవంతమైన విచారణతో నిందితుడికి శిక్ష పడేలా చేసిన దర్యాప్తు అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
