కుంట్లూరు ప్రభుత్వ భూమిపై వివాదం.. రెవెన్యూ అప్రమత్తత
– సర్వే నంబర్–24లో ఇరువర్గాల హక్కుల వాదనలు
ప్రభుత్వ భూమిని కాపాడిన రెవెన్యూ అధికారులు
అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 20 (విశాల భారతి):
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు గ్రామంలోని సర్వే నంబర్–24లో ఉన్న ప్రభుత్వ భూమిపై వివాదం నెలకొంది. మొత్తం 84 ఎకరాల 21 గుంటల ప్రభుత్వ భూమిలో పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి వంటి ప్రజాప్రయోజన అవసరాలకు భూములు కేటాయించగా, మిగిలిన రెండు నుంచి మూడు ఎకరాల స్థలంపై ప్రస్తుతం ఇరువర్గాలు హక్కులు తమవేనంటూ వాదిస్తున్నాయి.
గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు ఈ స్థలాన్ని తమ సంఘానికి ప్రభుత్వం కేటాయించిందని పేర్కొంటూ జేసీబీలతో స్థలాన్ని చదును చేసినట్లు సమాచారం. మరోవైపు హయత్‌నగర్ రైతు సహకార సంఘానికి కార్యాలయ భవన నిర్మాణం కోసం ఇదే సర్వే నంబరులో 500 గజాల స్థలాన్ని ప్రభుత్వం అధికారికంగా కేటాయించిందని ఆ సంఘం కార్యనిర్వహణ అధికారి మల్లికార్జున్ తెలిపారు. తమకు కేటాయించిన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఇదే భూమిపై కుంట్లూరుకు చెందిన చాడ ఎల్లయ్య కుటుంబ సభ్యులు కూడా తమ హక్కును వినిపించారు. 1978లో ప్రభుత్వం తమతో పాటు 25 కుటుంబాలకు ఈ స్థలాన్ని కేటాయించిందని, అప్పటి నుంచి అక్కడే నివాసం ఉంటూ పశుపోషణతో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అనంతరం జీవో నంబర్ 59 ప్రకారం 2022–23లో ఎమ్మార్వో కార్యాలయం ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తుండగా కొందరు అడ్డుకుని నిర్మాణాలతో పాటు దేవాలయాన్ని కూడా కూల్చివేశారని ఆరోపించారు. తమకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రశాంతంగా నివసించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఇరువర్గాలు తమ వద్ద ప్రభుత్వ అనుమతులు, ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంటుండటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాదాస్పద భూమికి సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ భూమిపై ఆక్రమణ జరుగుతోందన్న సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకుని ప్రభుత్వ భూమిని పరిరక్షించినట్లు వెల్లడించారు.
సర్వే నంబర్–24కు సంబంధించిన అన్ని భూ రికార్డులు, కేటాయింపు ఉత్తర్వులు, ఇతర పత్రాలను పరిశీలించిన అనంతరం చట్టప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములపై ఎలాంటి అక్రమ ఆక్రమణలను సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వివాదాలకు దిగకుండా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
