A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఆదాయానికి మించి ఆస్తులు… రెడ్కో డీఈపై ఏసీబీ దాడులు

0 104

ఆదాయానికి మించి ఆస్తులు… రెడ్కో డీఈపై ఏసీబీ దాడులు
– 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.. భారీ ఆస్తుల గుర్తింపు
– 15 కోట్ల ఆస్తులు వెలుగులోకి.. మార్కెట్ విలువ 80 కోట్లకు పైగా ఉంటుందన్న అంచనా

సైబరాబాద్ – విశాల భారతి
తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో)లో డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ తనిఖీలు రాత్రి వరకు కొనసాగగా, భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు, కీలక పత్రాలు అధికారుల చేతికి చిక్కినట్లు తెలిసింది.

ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి హైదరాబాద్‌లోని కొత్తగూడ, మాదాపూర్‌తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకు సంబంధించిన మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైన సోదాల్లో నివాసాలు, కార్యాలయాలు, లాకర్లు, వ్యాపారాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు.

సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.15 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇవి ప్రభుత్వ విలువల ప్రకారం మాత్రమేనని, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.80 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో నాలుగు ఇళ్లతో పాటు పలు విలువైన స్థలాలు, సుమారు రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు, నాలుగు లగ్జరీ కార్లు గుర్తించినట్లు సమాచారం.

అలాగే వెంకటరమణ భార్య పేరుతో నడుస్తున్న ఎమ్మెస్ ప్రైడ్‌తో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థల్లో భారీ పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆయా సంస్థలకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఇంట్లో లభించిన విదేశీ మద్యం సీసాలను నిబంధనల ప్రకారం ఎక్సైజ్ శాఖకు అప్పగించారు.

రెడ్కోలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల కేటాయింపులు, సరఫరా పనుల్లో కమిషన్ల రూపంలో అక్రమంగా డబ్బులు సంపాదించి, వాటితో బినామీల పేర్లపై ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. ఈ కోణంలో ఆర్థిక లావాదేవీలన్నింటినీ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.

ముత్యం వెంకటరమణ గతంలో 2019లో లంచం స్వీకరిస్తూ ఏసీబీ ట్రాప్‌కు చిక్కి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత కూడా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మరోసారి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం మరో ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులు ప్రాథమిక లెక్కలేనని, దర్యాప్తు పూర్తయ్యే సరికి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. బినామీ లావాదేవీలు, విదేశీ పెట్టుబడులు, ఇతర ఆర్థిక వ్యవహారాలపై కూడా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.